21 March, 2026 | 1:35 AM

వన్డే ప్రపంచకప్‌కు ప్రాబబుల్స్ రెడీ

21-03-2026 12:00 AM

20 మందితో బీసీసీఐ మెగాప్లాన్

ముంబై, మార్చి 20 : ప్రస్తుతం భారత క్రికెటర్లందరూ ఐపీఎల్‌తో బిజీగా ఉన్నారు. వచ్చే వారం మొదలుకానున్న ఐపీఎల్ 19వ సీజన్ కోసం ప్రిపేరవుతున్నారు. మరోవైపు బీసీసీఐ వన్డే ప్రపంచకప్ కోసం జట్టు ఎంపికపై దృష్టి పెట్టింది. దీని కోసం ఇప్పటికే 20 మంది ఆటగాళ్లతో ప్రాబబుల్స్ సిద్ధం చేసింది.

ఈ జాబితాలో ప్రతీ ఆటగాడి ప్రదర్శనను సెలక్టర్లు ప్రత్యేకంగా మానిటర్ చేయనున్నారు. ఐపీఎల్ మ్యాచుల్లోనూ సదరు ప్లేయర్ల ఆటతీరును సెలక్టర్లు దగ్గరుండి పరిశీలించనున్నారు. ప్రతి సెలక్టర్ ఖచ్చితంగా వారానికి ఒక్క మ్యాచ్ అయినా స్టేడియానికి వెళ్లి చూసేలా బీసీసీఐ రూల్ పెట్టింది. ఇలా అందరూ కలిసి వారానికి ఐదు మ్యాచులను కవర్ చేసేలా ప్లాన్ చేసింది. 2027 వన్డే ప్రపంచకప్ కోసం వీరి ఆటతీరు, ఫిట్‌నెస్‌ను సెలక్టర్లు అంచనా వేసి బీసీసీఐకి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.

స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లి , రోహిత్ శర్మలపై సెలక్టర్లు ఎక్కువగా దృష్టి సారించే అవకాశముంది. ఇప్పటికే టెస్టు, అంతర్జాతీయ టీ20లకు గుడ్‌బై చెప్పిన రోహిత్, కోహ్లీలకు ఈసారి ఐపీఎల్ కీలకం కానుంది.  గతేడాది దేశీ వన్డే క్రికెట్ బరిలో దిగిన ఈ ఇద్దరూ అక్కడా సత్తా చా టారు. తద్వారా తాము వన్డే వరల్డ్‌కప్ టోర్నీ కి సిద్ధంగా ఉన్నామని సంకేతాలు ఇచ్చారు. హర్షిత్ రాణా గాయంతో ఇప్పటికే టోర్నీ నుంచి వైదొలగగా.. మిగిలిన పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ, అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా బౌలింగ్‌ను సెలక్టర్లు ట్రాక్ చేయనున్నారని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.