అడ్మిషన్ల ఒత్తిడితో అల్లాడుతున్న ప్రైవేటు టీచర్స్
టార్గెట్లతో ప్రైవేటు స్కూళ్ల వేధింపులు..
టార్గెట్లు పూర్తి చేయకపోతే ఉద్యోగాలకే ముప్పు
జిల్లావ్యాప్తంగా ఇదే తంతు..
భద్రాద్రి కొత్తగూడెం, మే 25 (విజయక్రాంతి): సంవత్సరం అంతా విద్యార్థులను తీర్చిదిద్దే టార్గెట్.. సెలవుల్లో అడ్మిషన్‌ల టార్గెట్‌తో ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. ఈవేసవి సెలవులు, ఆదివారాలు లేకుండా అడ్మిషన్ల వేట.. అడ్మిషన్‌లు తీసుకురాపోతే జాబ్ తీసేస్తామని యాజమాన్యం టీచర్లకు హెచ్చరిక జారీ చేయటం శోచనీయం.
కొంతమంది ఉపాధ్యాయులు ఉద్యోగాన్ని దక్కించుకునేందుకు సొంత డబ్బులతో ఫీజులు సైతం చెల్లిస్తున్నారు. మరికొందరు అప్పులు చేసి మరీ ఫీజు కడుతున్నట్టు సమాచారం సార్, మేడం... మీ పిల్లలను మా స్కూల్లో చేర్చించండి. అవసరమైతే ఫీజులో తగ్గింపు మాట్లాడిస్తాం‘ అంటూ గడపగడపకు ఎక్కుతూ తల్లిదండ్రులను ప్రాధేయపడటం గమనార్హం.
అడ్మిషన్ల ఒత్తిడి టీచర్ల వ్యక్తిగతజీవితాలపై కూడా ప్రభావం..
ఓ పాఠశాలలో పని చేస్తున్న టీచర్ రోజంతా అడ్మిషన్ల కోసం తిరుగుతూ కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన ఆమె భర్త పాఠశాలకు వెళ్లి గొడవ చేసిన ఘటన ఇటీవల చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది తమపై జరుగుతున్న వేధింపులను అరికట్టాలని జిల్లా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులను వేడుకుంటున్నారు.






