జుట్టు ఎక్కువగా ఉందని విద్యార్థికి గుండు కొట్టించిన ప్రిన్సిపాల్
శేరిలింగంపల్లి, మార్చి 9 (విజయక్రాంతి): స్కూల్‌లో చదివే విద్యార్థులు ఎవరైనా జుట్టు పెంచుకుంటే తీసుకోమని హెచ్చరిస్తారు. లేదంటే తల్లదండ్రుల్ని పిలిచి మందలిస్తారు. ఓ ప్రైవేట్ స్కూల్‌లో జుట్టు ఎక్కువగా ఉన్నదని బాధ్యత గల ఓ స్కూల్ ప్రిన్సిపాల్ ఏకంగా గుండు కొట్టించిన సంఘటన హాఫిజ్‌పేట్‌లో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. ప్రేమ్‌నగర్ బీ-బ్లాక్‌లోని ఓ స్కూల్‌లో ఈశ్వర్ అనే విద్యార్థి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.
విద్యార్థికి జుట్టు ఎక్కువగా ఉందన్న సాకుతో, అతనికి బలవంతంగా గుండు చేయించడం తీవ్ర వివాదానికి దారితీసింది. తమ కుటుంబ ఆచారం ప్రకారం లక్ష్మీ నరసింహ స్వామికి మొక్కు ఉందని అందుకే జుట్టు కత్తిరించుకోలేనని ఆ విద్యార్థి ప్రిన్సిపాల్‌కు వివరించినప్పటికీ.. వినకుండా విద్యార్థి ఇష్టానికి వ్యతిరేకంగా ప్రిన్సిపాల్ బలవంతంగా గుండు చేయించినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు.




