10 March, 2026 | 8:52 AM

రైతుల సొమ్ముతో.. రాహుల్ బంధు!

10-03-2026 02:52 AM
  1. కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ 
  2. గాంధీ కుటుంబ అవసరాలకు ఏడాదికి వెయ్యి కోట్లు 
  3. ఈ పథకంతో సీఎం సీటును కాపాడుకుంటున్నడు 
  4. ఆరు గ్యారంటీల అమలుపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతాం 
  5. సిరిసిల్లలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

రాజన్న సిరిసిల్ల, మార్చి 9 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రం లో రైతుబంధు పథకాన్ని పక్కనపెట్టి ఆ నిధులతో ‘రాహుల్ బంధు’ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఎద్దేవా చేశారు. సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు రాహుల్‌గాంధీకి ఇచ్చే ఈ పథకం తెలంగాణలో పక్కగా రేవంత్‌రెడ్డి అమలుచేస్తున్నారని విమర్శించారు.

గాంధీ కుటుంబానికి ఎప్పుడు ఇబ్బంది అయినా వేల కోట్ల రూపాయలు పంపించేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. రైతులంతా రైతుబంధు వస్తుందని, కాంగ్రెస్ పెంచి ఇస్తామన్న నిధులను వస్తాయని ఎదురుచూస్తూ ఉంటే రేవంత్‌రెడ్డి రైతుబంధును ఎగ్గొడుతున్నాడని విమర్శించారు. ఇప్పటికే నాలుగుసార్లు రైతుబంధును రేవంత్ రెడ్డి ఎగ్గొట్టి, ముఖ్యమంత్రి సీటును కాపాడుకుంటున్నాడని ఎద్దేవాచేశారు.

సిరిసిల్ల లో సోమవారం బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడా రు. సామంత రాజులాగా రాహుల్ గాంధీ ఢిల్లీ గద్దెకు రేవంత్ కప్పం కడుతున్నారని, అందుకే రాహుల్‌కి చెల్లించాల్సిన కప్పం గురించి పేదల భూములు గుంజుకొని, పేద ల ఇల్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి మొదలుకొని ఖమ్మం దాకా అన్ని చోట్ల పేదల ఇళ్లను కూలగొట్టి వ్యాపారం చేసి డబ్బులు సంపాదిస్తున్నారని ఆరోపించారు.

ఆరు గ్యారంటీలను మొదటి క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకొని చట్టబద్ధత కల్పించి, అమలు చేస్తామని రాహుల్ గాంధీతో సహా అందరూ చెప్పిన మాటలను గుర్తు చేస్తూ తెలంగాణ ప్రజలకు బాకీ పడిన ఆరు గ్యారంటీల చట్టాన్ని ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తా విస్తామని చెప్పారు.

ప్రైవేట్ మెంబర్ బిల్లును తీసుకువచ్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లుకు ఓటు వేయాల్సివస్తుందని, ఎందుకంటే వారి నాయకుడు రాహుల్ గాంధీ చెప్పిన మాటనే తాము అసెంబ్లీలో చెప్తామని వెల్లడించారు. ఈ ప్రైవే ట్ మెంబర్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి మద్దతు ఇచ్చి రాహుల్‌గాంధీతో సహా తమ పార్టీ నేతలు అంతా ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కేటీఆర్ అన్నారు. 

గీత కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సాయం..

సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో ఇటీవల తాటిచెట్టు పైనుం చి కిందపడి మృతి చెందిన గీత కార్మికుడు సాయిలి కిషన్ గౌడ్ కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. వారికి సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా నిలు స్తూ, కిషన్ గౌడ్ ఇద్దరు పిల్లల పేరు మీద చెరో లక్ష రూపాయల చొప్పున, మొత్తం రూ. 2 లక్షల రూపా యలను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయించారు.