1 May, 2026 | 1:15 PM

విహార నౌక బోల్తా: తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య

01-05-2026 11:58 AM

జబల్‌పూర్: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జలాశయంలో(MP Cruise Boat Tragedy) బోల్తా పడిన క్రూయిజ్ బోటులో ప్రయాణిస్తున్న మరో ఐదుగురి మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీయడంతో, బర్గి డ్యామ్ దుర్ఘటనలో మృతుల సంఖ్య శుక్రవారం నాటికి తొమ్మిదికి చేరింది. మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ధర్మేంద్ర భావ్ సింగ్ లోధి మీడియాతో మాట్లాడుతూ.... గురువారం నాలుగు మృతదేహాలు లభించగా, సహాయక చర్యల సమయంలో తెల్లవారుజామున మరో ఐదు మృతదేహాలు దొరికాయి. దీంతో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరిందన్నారు.

ఇప్పటివరకు 22 మందిని రక్షించినట్లు పేర్కొన్నారు. సమగ్ర విచారణ చేపడతామని, ప్రాణాలతో బయటపడిన వారిలో ఒకరు లేవనెత్తిన లైఫ్ జాకెట్ల అంశంపై కూడా దర్యాప్తు చేస్తామని మంత్రి తెలిపారు. గురువారం సాయంత్రం అకస్మాత్తుగా సంభవించిన తుఫాను కారణంగా బర్గి డ్యామ్‌లో 29 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బందితో ప్రయాణిస్తున్న క్రూయిజ్ బోటు బోల్తా పడిందని అధికారులు తెలిపారు. గల్లంతైన ప్రయాణికుల కోసం రాత్రంతా గాలింపు, సహాయక చర్యలు కొనసాగాయని, ఇందులో సైన్యం, NDRF, SDRF బృందాలు పాల్గొన్నాయని రాష్ట్ర మంత్రి రాకేష్ సింగ్ తెలిపారు.