15-02-2026 12:00:00 AM
రాష్ట్రప్రజలను ఓటు బ్యాంకుగానే చూసింది
ఆ పార్టీ ముస్లిం లీగ్, మావోయిస్టులతో జతకట్టింది
దేశ భద్రతకు భంగం కలిగిస్తోంది.. చొరబాట్లను ప్రోత్సహిస్తోంది
అస్సాం పర్యటనలో ప్రధాని మోదీ ఆరోపణలు
5,450 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం
మొరాన్ ‘ఈఎల్‌ఎఫ్’పై ప్రధాని ఫ్లుటై ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఎయిర్‌ఫోర్స్‌కు అందుబాటులోకి రన్ వే
దిస్పూర్, ఫిబ్రవరి 14: యూపీఏ పాలనలో అస్సాంకు అన్యాయం జరిగిందని, దశాబ్దాల పాటు దేశాన్ని పాలించి కూడా రాష్ట్రాభివృద్ధి గురించి పట్టించుకోలేదని ప్రధాని మోదీ విమర్శించారు. అస్సాం పర్యటనలో భాగంగా శనివారం ప్రధాని మోదీ రూ.5,450 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముందుగా గౌహతి లో బ్రహ్మపుత్ర నదిపై రూ.3,030 కోట్లతో నిర్మించిన ‘కుమార్‌భాస్కర్ వర్మ సేతు’ను ప్రధాని ప్రారంభించారు. తర్వాత ఐఐఎం గౌహతి తాత్కాలిక క్యాంపస్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు.
పీఎం-ఈబస్ సేవ పథకంలో భాగంగా 225 ఎలక్ట్రిక్ బస్సులను ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. కేంద్రం నుంచి రాష్ట్ర వాటా కింద ఆర్థిక సంవత్సరంలో రూ.49,725 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ప్రధాని మాట్లాడుతూ.. యూపీయే ప్రభుత్వం అస్సాం ప్రజ లను కేవలం ఓటు బ్యాంకుగానే చూసిందని దుయ్యబట్టారు. దేశ భద్రత విషయంలోనూ ఆ పార్టీ నిర్లక్ష్యంగానే వ్యవహరించిందని ధ్వజమెత్తారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్, మావోయిస్టులతో చేతులు కలిపి దేశ ఐక్యతను దెబ్బతీస్తోందని ఆరోపించారు.
చొరబాటుదారులకు మద్దతు ఇస్తోందని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని, యూపీయే కంటే ఐదు రెట్లు ఎక్కువ నిధులను కేటాయించిందని గుర్తుచేశారు. రాష్ట్రానికి ఐఐఎంలు, వైద్య కళాశాలలు, డేటా సెంటర్ల వంటి అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చిందన్నారు. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో బ్రహ్మపుత్ర నదిపై కేవలం మూడు వంతెనలు మాత్రమే కట్టారని, ఎన్డీయే ప్రభుత్వం గడిచిన పదేళ్ల పాలనలోనే ఏడు వంతెనలను నిర్మించిందని వివరించారు.
ప్రధాని ఎయిర్‌క్రాఫ్ట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
దిబ్రూగఢ్ జిల్లా మొరాన్ బైపాస్ వద్ద కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ (ఈఎల్‌ఎఫ్) రన్ వేపై శనివారం ప్రధాని మోదీ విమానం (సీ౧౩౦జే) ల్యాండ్ అయింది. అనంతరం ప్రధాని రన్‌వేను లాంఛనంగా ప్రారంభించారు. ఈ రన్‌వే చైనా సరిహద్దుకు 300 కి.మీ దూరంలో ఉంది. రూ.100 కోట్లతో నిర్మించిన ఈ రన్ వే యుద్ధ సమయాల్లో భారత్ ఎయిర్‌ఫోర్స్‌కు ఉపయోగపడనుంది.
రన్ వే అంశంపై ప్రధాని మోదీ మాట్లాడుతూ.. క్లిష్ట సమయంలో ఎయిర్‌ఫోర్స్ అత్యవసర ప్రతిస్పందనకు ఈఎల్‌ఎఫ్ ఉపయోగపడుతుందన్నారు. యుద్ధవిమానాల టేకాఫ్, ల్యాండింగ్‌కు అనుకూలంగా ఈఎల్‌ఎఫ్ నిర్మించామని వెల్లడించారు. చైనాతో సరిహద్దు వివాదాల వేళ ఈశాన్య భారతంలో నిర్మించిన ఈ ఈఎల్‌ఎఫ్ ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇంఫాల్‌కు కాంగ్రెస్ ఫ్లుటై టికెట్
మణిపూర్‌లోని లిటాన్ సరిఖోంగ్ గ్రామంలో ఇటీవల తాంగ్ఖుల్ నాగా వర్గానికి చెందిన వారి ఇళ్లకు సాయుధ మిలిటెంట్లు నిప్పుపెట్టారు. దీంతో ఆ రాష్ట్రంలో మళ్లీ ఉద్రిక్తలు చోటుచేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రధా ని మోదీ మణిపూర్‌లో పర్యటించి, అక్కడి ప్రజలకు భరో సా ఇవ్వకుండా.. అస్సాంలో పర్యటించడం ఏమిటని.. ప్రశ్ని స్తూ కాంగ్రెస్ పార్టీ వినూత్నంగా నిరసన వ్యక్తం చేసింది. దీనిలో భాగంగానే ప్రధాని మోదీ కోసం కాంగ్రెస్ నేత పవన్ ఖేరా గౌహతి నుంచి ఇంఫాల్‌కు ఫ్లుటై టిక్కెట్ బుక్ చేసి, ఆ టికెట్ చిత్రాన్ని సోషల్ మీడియాలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా పవర్ ఖేరా స్పందిస్తూ.. గౌహతి నుంచి ఇంఫాల్‌కు కేవలం గంట ప్రయాణమని, ప్రధాని మోదీకి రవాణా ఖర్చులు సైతం ఉండవని, ప్రధానికి ఇబ్బంది లేకుండా తామే టికెట్ బుక్ చేశామని తెలిపారు. ప్రధాని ఫోన్ నంబర్ తన వద్ద లేదని, అందుకే టికెట్‌ను పోస్ట్ చేయాల్సి వచ్చిందని, దయచేసి ప్రధాని టికెట్‌ను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధాని మణిపూర్‌కు వెళ్లి అక్కడి ప్రజలకు భరోసా ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మణిపూర్ మూడేళ్ల నుంచి రావణ కాష్టంలా రగులుతూనే ఉందని, ప్రధాని దయచేసి మణిపూర్ వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.