21 July, 2026 | 9:30 AM

అర్మూర్ లో ఉద్రిక్త వాతావరణం

20-07-2026 08:54 PM

– ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి కాంగ్రెస్‌ పిలుపు నేపథ్యంలో ఉధ్రిక్తత

– కాంగ్రెస్‌ నాయకుల ముందస్తు అరెస్టులు 

– ఆర్మూర్‌లో బీఎన్‌ఎస్‌ 163 సెక్షన్‌ విధించిన పోలీసులు

– అంకాపూర్‌లో ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి, పెర్కిట్‌లో కాంగ్రెస్‌ ఇన్‌చార్జి వినయ్‌రెడ్డి గృహనిర్భందం

ఆర్మూర్‌,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై ఇటీవల బీజేపీ నిర్వహించిన రణభేరిలో ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేష్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో దుమారం లేపింది. ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఆర్మూర్‌లోని ఎమ్మెల్యే నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. వారి హెచ్చరికకు ప్రతి స్పందించిన ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి తాను యుద్ధానికి సిద్దం అంటూ అంకాపూర్‌ వేదికగా తనకు సమ ఉజ్జీ అయిన కాంగ్రెస్‌ నాయకుడు చర్చకు రావాలంటూ సవాస్‌ విసిరారు.

దీంతో ఆర్మూర్‌ పట్టణంలో, అంకాపూర్‌లో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉండడంతో సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు పోలీసులు ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్మూర్‌ నియోజకవర్గంలో బీఎన్‌ఎస్‌ 163 సెక్షన్‌ను విధించారు. ఆర్మూర్‌ పట్టణంతో పాటు ఆర్మూర్, నందిపేట, మాక్లూర్, ఆలూర్, డొంకేశ్వర్‌ మండలాల్లో కాంగ్రెస్‌ నాయకులను ముందస్తు అరెస్టులు చేసి సమీపంలోని ఇతర మండలాల పోలీస్‌ స్టేషన్లకు తరలించారు.

ఇరు పార్టీల నేతల గృహ నిర్భందం...

లా అండ్‌ ఆర్డర్‌ సమస్య వస్తుందని ఊహించిన పోలీసులు ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డిని, కాంగ్రెస్‌ పార్టీ ఆర్మూర్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి పొద్దుటూరి వినయ్‌రెడ్డిని వారి వారి నివాసాల్లో గృహ నిర్భందం చేసారు. ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి బయటికి వచ్చే ప్రయత్నం చేయగా అడ్డుకున్న పోలీసలు ఆయనను నిలవరించి తిరిగి తన ఇంట్లోకి పంపించారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఎమ్మెల్యే రాకేష్‌ రెడ్డి తన వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. విద్యార్థుల కోసం చేస్తున్న ఉద్యమానికి రాజకీయ రంగు పులిమి ఆర్మూర్‌ను రణరంగంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మరో వైపు వివిధ మార్గాల ద్వారా పలువురు కాంగ్రెస్‌ నాయకులు అంకాపూర్‌లో ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి ఇంటి సమీపానికి చేరుకోవడంతో పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. అయితే కాంగ్రెస్‌ నాయకుడు వినయ్‌రెడ్డి మాత్రం ఎమ్మెల్యే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆర్మూర్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నా, పోలీసుల ముందస్తు వ్యూహంతో వారి పర్యవేక్షణతో శాంతియుతంగా ఉందని పోలీసు అధికారులు ప్రకటించారు.

కాంగ్రెస్‌ పతనం ప్రారంభమైంది: ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి 

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌లోని ఆయన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్‌ కులాచారితో కలిసి మాట్లాడారు.

ఇప్పటికైనా  తెలంగాణ ప్రజలకు క్షమాపన చేప్పి ఇచ్చిన హామీ ప్రకారం ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతు రుణ మాఫీలు, నిరుద్యోగ భృతి, కల్యాణ లక్ష్మి, పింఛన్లు అందజేయాలని హితవు పలికారు. అభివృద్ధిపై చర్చకు రాలేక వారిది వారు అరెస్టులు చేయించుకొని పోలీస్‌ స్టేషన్లలో కూర్చున్నారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు పక్కదారి పట్టించకుండా విద్యార్థులకు న్యాయం చేయాలని  డిమాండ్‌ చేసారు. జిల్లా వాసి అయిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌గౌడ్‌ అభివృద్ధిపై చర్చ పెట్టాలని అన్నారు.

అభివృద్ధిలో పోటీ  పడాలి – రాకేష్‌రెడ్డిని ఓడించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా

– కాంగ్రెస్‌ పార్టీ ఆర్మూర్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి వినయ్‌రెడ్డి

ప్రజా స్వామ్య వ్యవస్థలో ప్రజల  ఓటుతో గెలుపొందిన ప్రజా ప్రతినిధులు అభివృద్ధి కోసం పోటీ పడాలి కానీ అనవసరమైన విషయాల్లో యుద్ధానికి సిద్దమనడం కాదని  కాంగ్రెస్‌ పార్టీ ఆర్మూర్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి వినయ్‌రెడ్డి హితవు పలికారు. ఆర్మూర్‌ పట్టణంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను ఓడిపోయినప్పటికీ కుల సంఘాలకు, రోగులకు చికిత్స కోసం నిధులు మంజూరు చేయిస్తున్నానన్నారు.

రాకేష్‌రెడ్డి ఎన్నికల సమయంలో ఊరికి పది ఇళ్లు తన సొంత డబ్బులతో నిర్మిస్తానని, ఒక్క రూపాయికే కార్పోరేట్‌ వైద్యం అందిస్తామని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి గెలిచిన అనంతరం ఆ హామీలను పట్టించుకోలేదన్నారు. ప్రజలను భ్రమలో పెడుతున్న రాకేష్‌రెడ్డిని బీజేపీ కార్యకర్తలు కూడా నమ్మొద్దని హితవు పలికారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు చేసి తర్వాత అభివృద్ధి కోసం కలిసి పని చేద్దామని తాను చెప్పినా అభివృద్ధిలో కలిసి రావడం లేదన్నారు. కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు, సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ గురించి మరో మారు మాట్లాడితే నియోజకవర్గంలోని గ్రామాల్లో తిరగనివ్వకుండా చేస్తామని హెచ్చరించారు.