నా శ్వాస ఊపిరి ప్రజలే
యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): నా శ్వాస ఊపిరి ఉన్నంతవరకు ప్రజల క్షేమం కోసమే పనిచేస్తానని నిరంతరం ప్రజల్లోనే ఉంటానని, ఇది చూసి కొంత మంది జీర్ణించుకోలేక నాపై బురద చల్లే వ్యవహారం చేస్తున్నారని ఆ బురద నా మెడలో పూలవలే పడుతున్నాయని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అప్పటి టిఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో చేయలేని పనులను రెండున్నర సంవత్సరాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజా పాలనలో చేస్తుంటే ప్రతిపక్ష పార్టీల వారు,
వారి పెద్దల మెప్పు కోసం నా పైన విమర్శలు చేస్తున్నారని, ఆ పార్టీలోనే నలుగురు పోటీ పడుతున్నారని ఇంకొంచెం ముందుకెళ్లి కల్లూరి రామచంద్ర రెడ్డి తనపై ఎక్కువగా విమర్శలు చేస్తున్నాడని ఎన్నికలవేళ ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని అన్నారు. రెండున్నర సంవత్సరాలా అనంతరం ఎలక్షన్లలో మాజీ ఎమ్మెల్యే, వారి భర్త లేదా మరో ఇద్దరు నాయకులు మొత్తం నలుగురు నా పై పోటీ చేసే సిద్ధమవుతున్నారని గ్రూపులుగా విడిపోయి విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఆ పార్టీ కాక మరి ఏ పార్టీ నుండి వచ్చిన ప్రజాక్షేత్రంలో వారికి ఓటమి తప్పదని అన్నారు.
ప్రతిరోజు ప్రతిక్షణం ప్రజల కోసం పాటుపడుతున్నానని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే ఏ ఒక్కరికి ఆపద వచ్చినా బిడ్డలా, కొడుకులా,ఓ తమ్ముడిలా, అన్నలా పనిచేస్తున్నానని అన్నారు. ప్రజా పాలనలో ప్రజలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, సన్న బియ్యం, పెన్షన్ కొత్త రేషన్ కార్డులు, పేదలకు సొంతింటి కల ఇందిరమ్మ ఇల్లు, రైతులకు రుణమాఫీ, సన్న బియ్యం పై బోనస్, యూరియా, రైతు బంధు, రైతు భీమా, మండలానికో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామని ఇది చూసి ఓర్వలేక రైతులను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని అన్నారు. ఇన్ని కార్యక్రమాలను అమలు చేస్తుంటే నా దిష్టిబొమ్మలను తలగబెట్టడం ఎంతవరకు న్యాయమని ప్రతిపక్షాలు పనిచేయకపోతే విమర్శించాలి తప్ప చిల్లర మల్లర రాజకీయాలు చేయవద్దని హితువు పలికారు. ఆలేరు అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.






