8 August, 2026 | 10:18 PM

పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

08-08-2026 09:04 PM

పెండింగ్ డీఏలు విడుదల చేయాలి

జీఓ 25ను సవరించాలి

టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్ కుమార్

కామారెడ్డి,(విజయక్రాంతి): ఉద్యోగులకు  పిఆర్సిని వెంటనే ప్రభుత్వం ప్రకటించాలని టి పి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్ కుమార్ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. పెండింగ్ డీఏలను విడుదల చేయాలని, ప్రాథమిక విద్యకు నష్టదాయకంగా ఉన్న జీఓ 25ను సవరించాలని కోరారు. టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చింతల లింగం అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై దశలవారీగా ఉద్యమాలు చేపడుతున్నట్లు తెలిపారు.పీఆర్సీ ప్రకటించే వరకు ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 12, 13 తేదీల్లో మండల కేంద్రాల్లో నిరసనలు, తహసీల్దార్లకు మెమోరాండాలు అందజేయడం, ఆగస్టు 19న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆగస్టు 21 నుంచి 26 వరకు రాష్ట్ర, జిల్లా బృందాలు పర్యటించి జిల్లా కేంద్రాల్లో ప్రెస్‌మీట్లు నిర్వహిస్తాయని, ఆగస్టు 29న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేపట్టనున్నట్లు వెల్లడించారు.

ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చలో అసెంబ్లీ నిర్వహిస్తామని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడు చింతల లింగం మాట్లాడుతూ... ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని, టెట్‌లో సర్వీస్ వెయిటేజ్ ఇవ్వాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని, జీఓ 317 బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.