అధికారిని బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడిన ఇద్దరి అరెస్ట్
ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లా వ్యవసాయ అధికారిని బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు సోషల్ మీడియా జర్నలిస్టులను అరెస్ట్ చేసినట్లు ఆసిఫాబాద్ డీఎస్పీ బి. అశోక్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం... జిల్లా వ్యవసాయ అధికారి బోర్కుట్ వెంకటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆగస్టు 5న ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో బుతే దేవేందర్, డుప్త సురేష్ పరస్పరం కుమ్మక్కై అధికారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
రాధిక ట్రేడర్స్ యజమానితో ఉన్న వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో దుకాణాన్ని మూసివేయించేందుకు అధికారులపై ఒత్తిడి తెచ్చినప్పటికీ, దుకాణానికి లైసెన్సులు, సంబంధిత రికార్డులు సక్రమంగా ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు. అనంతరం ఫోన్ కాల్స్, వీడియోలు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా వ్యవసాయ అధికారిపై ఒత్తిడి తెచ్చి తొలుత రూ.20 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలిపారు. బెదిరింపుల ద్వారా జూలై 26న రూ.1.30 లక్షలు నగదుగా తీసుకున్నట్లు పేర్కొన్నారు. కేసుకు సంబంధించి వాట్సాప్ చాట్స్, సోషల్ మీడియా పోస్టులు, వీడియోలు, స్క్రీన్‌షాట్లు తదితర డిజిటల్ ఆధారాలను పోలీసులు సేకరించారు.
హైదరాబాద్‌లో ఉన్న నిందితులను ఆగస్టు 7న ఆసిఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం కోర్టులో రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిపారు.నిందితులు జర్నలిస్టులుగా తమ వృత్తిని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిన అంశంపై దర్యాప్తు కొనసాగుతోందని డీఎస్పీ తెలిపారు. డిజిటల్ ఆధారాలు, ఆర్థిక లావాదేవీలు, ఫోన్ కాల్స్ తదితర సాక్ష్యాలను సేకరించి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఇన్‌స్పెక్టర్ ఎన్. రవి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






