ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): ప్రజావాణిలో వివిధ సమస్యలతో వచ్చే ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ తో కలిసి జిల్లా కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించి, పరిశీలించారు.
ఈ సందర్భంగా 224 అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు కేటాయిస్తూ, ప్రజా సమస్యలపై తగిన చర్యలు తీసుకొని, త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, ఆర్టీఓ శ్రీనివాస్ గౌడ్, డీఎంహెచ్‌ఓ మల్లికార్జున రావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఎన్.ఎల్. నరసింహ రావు, ఎక్సైజ్ ఎస్పీ అనిత, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.






