26 May, 2026 | 1:01 AM

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

26-05-2026 12:02 AM

కలెక్టర్ కె. హరిత

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 25(విజయ క్రాంతి):ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై అందుతున్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్, జిల్లా రెవెన్యూ అధికారి దాసరి వేణుతో కలిసి పాల్గొని అర్జీదారుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.

ఆసిఫాబాద్ మండలం చిర్రకుంట గ్రామానికి చెందిన నాగేష్ తాను కొనుగోలు చేసిన భూమిని భూ భారతి పోర్టల్లో నమోదు చేసి పాస్బుక్లో పొందుపరచాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. సిర్పూర్ (యు) మండలం మహాగాం గ్రామానికి చెందిన కొడప హిరామన్ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో క్షేత్ర సహాయకుడిగా పనిచేస్తుండగా విధుల నుంచి తొలగించారని, తిరిగి ఉద్యోగంలో అవకాశం కల్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.సిర్పూర్ (యు) మండలం కోహినూర్ గ్రామానికి చెందిన మండాడి రంభ తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు.

పెంచికల్పేట మండలం చెడ్పాయి గ్రామానికి చెందిన రాజయ్య తెలంగాణ ఉద్యమంలో పనిచేసినందున తనకు ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.రెబ్బెన మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన సునార్కార్ లింగయ్య తన భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు.కాగజ్నగర్ మండలం బోరిగాం గ్రామానికి చెందిన సాహస్తి తనకు దివ్యాంగుల పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ అర్జీ అందజేశారు.

ఆసిఫాబాద్ మండల కేంద్రంలోని బ్రాహ్మణవాడకు చెందిన విజయ్కుమార్ తనకు వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, అర్జీదారులు పాల్గొన్నారు.