ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, జులై 6 (విజయక్రాంతి): ప్రజల సమస్యల పరిష్కారమే వేదికగా సాగుతున్న ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి అనంతరం ఆయన అధికారులతో మాట్లాడారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా, డివిజన్ స్థాయి ప్రజావాణి దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. అధికారులు ప్రజలు పెట్టుకున్న అర్జీలను పెండింగ్లో ఉంచకుండా, నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డివిజన్ స్థాయి ప్రజావాణికి అన్ని శాఖల డివిజనల్ అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా జిల్లా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. స్థానిక సమస్యలు స్థానికంగానే పరిష్కారమైతే ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయన్నారు.
సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భూ సమస్యలకి సంబందించి 43 దరఖాస్తులు, డీపీఓ 5, మున్సిపాలిటీ 5, డిడబ్ల్యుఓ 4, వివిధ శాఖలకు సంబంధించి 19 దరఖాస్తులు రాగా మొత్తం 76 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, డిఆర్‌ఓ ప్రేమ్ రాజు, జడ్ పిసిఇఓ శిరీష డీపీఓ యాదగిరి, డిఎంహెచ్‌ఓ వెంకటరమణ, పిడి హౌసింగ్ సిద్ధార్థ్, డిఎఫ్‌ఓ దామోదర్ రెడ్డి, సిపిఓ కిషన్ డిఇఓ అశోక్ , సంక్షేమ అధికారులు నరసింహారావు, దయానంద రాణి ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.






