23 July, 2026 | 1:25 AM

కోళ్ల వ్యర్థాలకు రూ.32 లక్షల ధర..!

23-07-2026 12:00 AM
  1.   9 నెలల టెండర్ ఇంత పలికిందంటే అసలు వ్యర్థాల విలువ ఎంత? 
    1. వ్యాపార రహస్యం ఏమిటి?

వనపర్తి, జూలై 22 ( విజయక్రాంతి ) : సాధారణంగా ‘వ్యర్థం‘ అంటే పారవేయాల్సి న వస్తువుగా భావిస్తాం. కానీ అదే వ్యర్థం కో సం ఇటీవల వనపర్తి మున్సిపాలిటీ లో జరిగిన వేలం పాటలో ఏకంగా ఓ కాంట్రాక్టర్ ఏకంగా రూ.32 లక్షలు చెల్లించి టెండర్ ద క్కించుకోవడం ఇప్పుడు జిల్లాలో హాట్ టా పిక్గా మారింది.

వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో కోళ్ల దుకాణాల నుంచి వచ్చే వ్యర్థా లను తొమ్మిది నెలల పాటు సేకరించే హక్కు కోసం పలికిన ఈ టెండర్ వెనుక భారీ ఆర్థిక ప్రయోజనం దాగి ఉందనే చర్చ సాగుతోం ది. కేవలం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికే అయితే ఇంత పెట్టుబడి పెట్టడం సాధ్యమేనా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

లాభం లేకుంటే రూ.32 లక్షలు ఎందుకు?

వ్యాపారంలో పెట్టుబడి పెట్టే ప్రతి ఒక్కరూ లాభాన్నే ఆశిస్తారు. తొమ్మిది నెలల కాలానికి రూ.32 లక్షలు చెల్లించి టెండర్ పొందిన కాంట్రాక్టర్కు రవాణా ఖర్చులు, కార్మికుల వేతనాలు, వాహనాల నిర్వహణ, ఇతర ఖర్చులు కూడా ఉంటాయి. ఇవన్నీ భరించిన తర్వాత కూడా లాభం ఉండాలంటే కోళ్ల వ్యర్థాలకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

వ్యర్థమా... విలువైన ముడి సరుకా?

కోళ్ల వ్యర్థాలను సాధారణంగా రెండరింగ్ యూనిట్లు, సేంద్రియ ఎరువుల తయారీ, బయోగ్యాస్ వంటి అవసరాలకు వినియోగించే అవకాశం ఉంది. అదే సమయంలో, ఈ వ్యర్థాలు ఇతర రంగాలకు కూడా మళ్లుతున్నాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.

మున్సిపాలిటీకి ఆదాయం... కానీ పర్యవేక్షణ ఉందా?

టెండర్ ద్వారా మున్సిపాలిటీకి ఆదా యం రావడం స్వాగతించదగిన విషయమే. అయితే వ్యర్థాలను సేకరించిన తర్వాత అవి ఎక్కడికి వెళ్తున్నాయి? ఎలాంటి పరిశ్రమలకు సరఫరా అవుతున్నాయి? వాటి వినియోగాన్ని ఎవరు పర్యవేక్షిస్తున్నారు? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.

విచారణ అవసరమే

రూ.32 లక్షల టెండర్ అనేది కేవలం మున్సిపాలిటీకి వచ్చిన ఆదాయంగా మాత్రమే చూడకుండా, ఆ వ్యర్థాల వెనుక ఉన్న ఆర్థిక వ్యవస్థ ఏమిటి? వాటి అసలు మార్కెట్ విలువ ఎంత? వాటి వినియోగం నిబంధనలకు అనుగుణంగా జరుగుతోందా? అనే అంశాలపై సంబంధిత శాఖలు సమగ్రంగా పరిశీలిస్తేనే ప్రజల్లో ఉన్న సందేహాలు నివృత్తి అవుతాయి.