బెంబేలెత్తిస్తున్న కోతులు!
- మండల కేంద్రంలో కోతుల బెడద
- ప్రభుత్వ పాఠశాలలోని చెట్లపైనే మకాం
- అకారణంగా మీదకు విరుచుకుపడుతున్న వానరాలు
- పలువురికి గాయాలు.. పట్టించుకోని అధికారులు
గుండాల, జులై22, (విజయక్రాంతి): మండల కేంద్రంలో రోజు రోజుకూ కోతులు విపరీతంగా పెరుగుతూ స్త్వ్రర విహారం చేస్తున్నాయి. అకారణంగా మహిళలు, పిల్లలు, వృద్ధుల మీదకు దాడికి దిగుతున్నాయి. వీటి భయానికి ఇప్పటికే పలువురు గాయపడ్డారు. ఒకప్పుడు ఒక్క కోతి కూడా లేకుండా గ్రామం ప్రశాంతంగా ఉండేదని, ఎక్కడి నుండి వచ్చాయో గానీ మందలుగా తయారై తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నాయని గ్రామస్థులు మొరపెట్టుకుంటున్నారు.
ప్రభుత్వ పాఠశాల ఆవరణలోని వృక్షాలపై, మండల కేంద్రంలోని భారీ వృక్షాలపై నివాసం ఉంటూ షాపులపై, ఇండ్లపై దండుగా మూకుమ్మడిగా దాడి చేస్తూ వస్తువులను ఎత్తుకెళ్లుతున్నాయని, దీనితో ఇండ్లలో ఎప్పుడూ కూడా తలుపులు వేసుకునే పరిస్థితి వస్తున్నదని మహిళలు వాపోతున్నారు. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ప్రతీ రోజు గుంపులుగా తిరుగుతుంటే పాఠశాలకు వెళ్లే విద్యార్థులపై ఎప్పుడు దాడి చేస్తాయోనని వారి తల్లిదండ్రులు భయం వ్యక్తం చేస్తున్నారు.
రోజు రోజుకి వాటి సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నా కూడా పట్టించుకునే వారు లేకపోవడంతో కోతుల బెడదను నివారించే వారే లేరా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది వీటి బాధను తట్టుకోలేక వారి ఇళ్లల్లో ఉన్న పండ్ల చెట్లను, కూరగాయల మొక్కలను నరికేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఏదైనా పెద్ద ప్రమాదం జరగక ముందే పట్టించుకొని కోతుల బెడదను నివారించాలని మండల కేంద్రంలోని మహిళలు, వ్యాపారస్థులు, ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
పంచాయతీ సెక్రటరీ వివరణ
కోతుల సమస్యపై గుండాల గ్రామపంచాయతీ సెక్రటరీ శివ కృష్ణను వివరణ కోరగా త్వరలో ఏర్పాటు చేసే పాలకవర్గ సమావేశంలో సర్పం మరియు వార్డు మెంబెర్స్ తో చర్చించి ఈ సమస్యపై ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
కోతుల కారణంగా చేయి విరిగింది..
స్థానిక ఎంపీపీ ఎస్ పాఠశాలలో స్కావెంజర్ గా పనిచేస్తున్నాను. పాఠశాల ఆవరణను శుభ్రం చేస్తున్న సమయంలో మూకుమ్మడిగా కోతులు దాడి చేయడంతో భయంతో పరిగెడుతూ కిందపడ్డాను. ఆ సమయంలో నా చెయ్యి పెరిగింది. కోతుల బెడదను తొలగించాలి.
గడ్డం పాపయ్య, గుండాల






