23 July, 2026 | 12:32 AM

పల్లెల్లో నకిలీ ఎరువుల కలకలం!

23-07-2026 12:00 AM
  1. డీఏపీ కొరత సాకుగా రైతులకు టోకరా.. 
  2. కల్వకుర్తి మండలంలో విజిలెన్స్ అధికారుల దాడులు

కల్వకుర్తి జులై 22: నాగర్ కర్నూల్ జిల్లాలో నకిలీ ఎరువుల వ్యవహారం కలకలం రేపుతోంది. డీఏపీ ఎరువుల కొరత ఉందని, తాము నేరుగా కంపెనీ నుంచి తక్కువ ధరకే సరఫరా చేస్తున్నామని నమ్మబలికి కొందరు దళారులు రైతులకు నకిలీ ఎరువులను విక్రయిస్తున్నారు. గత కొంతకాలంగా నాగర్ కర్నూల్ జిల్లాలో నకిలీ ఎరువుల విక్రయం జరుగుతుండగా, ఈ ఏడాది కూడా అదే తరహాలో గ్రామాల్లో రాత్రికి రాత్రే  వాహనాల ద్వారా ఎరువుల బస్తాలను సరఫరా చేశారు.

కల్వకుర్తి మండలంలోని పలు గ్రామాల్లో రైతులకు ఒక్కో బస్తాను రూ.1,300 చొప్పున విక్రయించారు. ముందస్తుగా రైతు వద్దకు వచ్చి ఎన్ని బస్తాలు కావాలో నమోదు చేసుకుని వెళ్లి రాత్రికి రాత్రే బస్తాలు దించేవారు. తర్వాత వచ్చి డబ్బులు తీసుకుంటున్నట్లు పలు రైతులు తెలిపారు.

రాత్రికి రాత్రే బస్తా లు సరఫరా చేయడం పట్ల కొంతమంది రైతులు అనుమానం వచ్చి వాటి కొనుగోలుకు  నిరాకరించారు. _ బిజినపల్లిలో వెలుగులోకి. .. నకిలీ ఎరువుల విక్రయ వ్యవహారం జిల్లాలో కొంతకాలంగా జరుగుతున్నప్పటికీ బిజినపల్లి మండలం మహదేవుని పేట గ్రామంలో వెలుగులోకి రావడంతో , విజిలెన్స్ అధికారులు లోతైన విచారణ జరుపుతున్నారు. అందులో భాగంగా బుధవారం కల్వకుర్తి మండలం లింగసానిపల్లి గ్రామంలో దాడులు నిర్వహించి సుమారు 45 ఎరువుల బస్తాలను గుర్తించినట్లు సమాచారం.

మరి కొంత మంది వ్యాపారులు తమ గోదాముల్లోనూ ఈ ఎరువులను నిల్వ చేసి విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నకిలీ ఎరువుల బస్తాలపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో తో పాటు, ఓ కంపెనీ పేరు, ధర ముద్రించి ఉండటంతో అవి అసలు ఎరువుల్లాగే కనిపించాయి. దీంతో రైతులు వాటిని నిజమైనవేనని నమ్మి కొనుగోలు చేశారు.

వానాకాలం ప్రారంభానికి ముందే ఈ బస్తాలు రైతుల ఇళ్లకు చేరగా, కొందరు ఇప్పటికే వాటిని పొలాల్లో వినియోగించగా, మరికొందరు నిల్వ ఉంచుకున్నారు. _ అధిక ధరలకు విక్రయాలు. . కల్వకుర్తి మండలంలో నకిలీ ఎరువుల విక్రయం అధికంగా జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం వరి నాట్లు ప్రారంభం కావడంతో రైతులు డీఏపీ ఎరువును ఎక్కువగా ఉపయోగిస్తారు.

కొంతమంది వ్యాపారులు పాత నిలువలను గోదాంలో ఉంచి రూ,1350కు అమ్మాల్సి ఉండగా రూ ,1800 విక్రయిస్తున్నారు. అధికారులు దుకాణాల వద్ద స్టాక్ బోర్డులను ప్రదర్శించే విధంగా చర్యలు తీసుకొని ఎమ్మార్పీ ధరలకే విక్రయించేలా చూడాల్సిన అవసరం ఉంది. రైతులను మోసం చేసిన వారిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు అధికారులను కోరుతున్నారు.