23 July, 2026 | 12:31 AM

రోడ్డు దాటాలంటే భయం.. భయం..

23-07-2026 12:00 AM
  1. అష్ట కష్టాలు పడుతున్న మహిళలు, వృద్ధులు
  2. ప్రశాంత్‌నగర్ వద్ద తరచూ ప్రమాదాలు
  3. ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని స్థానికుల డిమాండ్

కూకట్‌పల్లి, జూలై 22 (విజయక్రాంతి): కూకట్పల్లి నియోజకవర్గం ప్రశాంత్ నగర్ వద్ద కూకట్పల్లి సికింద్రాబాద్ ప్రధాన రహదారిని దాటడానికి స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రశాంత్ నగర్ ప్రాంతంలో ఎన్నో చిన్న చిన్న పరిశ్రమలు ఉండడంతో ఆ కంపెనీలలో ఉపాధి పొందుతున్న కార్మికులు రోడ్డును దాటడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూసాపేట్, జనతా నగర్ కాలనీలలో ఎంతోమంది మధ్యతరగతి నిరుపేదలు నివాసం ఉంటారు.

జీవనోపాధి కోసం ప్రశాంత్ నగర్ లోని పలు కంపెనీలలో వేలాదిమంది  కార్మికులుగా పనిచేస్తున్నారు. డ్యూటీలో భాగంగా కంపెనీకి వెళ్లాలన్న, విధులు ముగించుకొని తిరిగి ఇంటికి రావాలన్నా రోడ్డును దాటాల్సిన పరిస్థితి వస్తుంది. నిత్యం రద్దీగా ఉండే రహదారిని దాటడం మహిళలకు, కార్మికులకు కష్టతరంగా మారింది. ఉదయము సాయంత్రం సమయంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండటంతో రోడ్డు దాటలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజీవ్ గాంధీ నగర్, శ్రీశ్రీ నగర్, ఇందిరానగర్  వాసులు కూకట్ పల్లి,లింగంపల్లి, అమీర్ పేట్ నాంపల్లి వైపు వెళ్లాలంటే రోడ్డు దాటి బస్సు టెర్మినల్ వైపు వెళ్లడానికి  నరకయాతన అనుభవిస్తున్నారు.

మహిళలు, వృద్ధులు, చిన్నారులు రోడ్డు దాటాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇక్కడ ఫుటోవర్ బ్రిడ్జి నిర్మించాలని స్థానిక కాలనీ వాసులు ప్రయాణికులు ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ స్పందించలేదని ఆరోపిస్తున్నారు. రోడ్డు దాటుతున్న క్రమంలో నెలలో నాలుగైదు సార్లు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని కార్మికులు, స్థానిక ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించడమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారమని స్థానికులు పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేశారు. పటాన్చెరు నుండి సికింద్రాబాద్ వెళ్లే ప్రధాన రహదారి కావడంతో నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ఈ రోడ్డుపై ఫుట్ ఓవర్ బ్రిడ్జి తప్పనిసరి అత్యవసరమని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించి సమస్యను సత్వరమే పరిష్కరించాలని కాలనీవాసులు కార్మికులు, స్థానిక నాయకులు, కార్మిక సంఘాల నాయకులు కోరుచున్నారు.

ప్రమాదాల బారిన పడుతున్నాం..

మూసాపేట, జనతానగర్, జింకలవాడ కాల్ మీలలో నివాసముండే నిరుపేదలు ఉపాధి కోసం ప్రశాంత్ నగర్ పారిశ్రామిక వాడలోని పలు చిన్నచిన్న కంపెనీలలో పనిచేస్తున్నారు. పనిలో భాగంగా ప్రతిరోజు ప్రశాంత్ నగర్ వెళ్లాలంటే  రద్దీగా ఉండే రోడ్డు దాటాల్సిన పరిస్థితి.

రాజీవ్ గాంధీనగర్, శ్రీశ్రీ నగర్, ఇందిరానగర్ కాలనీవాసులు బస్సు ఎక్కాలన్నా, అవసరాల నిమిత్తం సిటీలోకి వెళ్లాలన్న రోడ్డు దాటి బస్సు టర్మినల్ కు వెళ్లాల్సిన పరిస్థితి. నిత్యం రద్దీగా ఉండే రోడ్డు దాటాలంటే మహిళలు వృద్ధులు దాటలేక ప్రమాదాల బారిన పడుతున్నారు. గతంలో ఎన్నోసార్లు జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ లకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలన్నారు.

  జి.కృష్ణ, సీపీఐ కూకట్‌పల్లి మండల కార్యదర్శి