కబ్జా కోరల్లో పోతారం వాగు
పట్టించుకోవడంలేదని ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులపై ప్రజల ఆగ్రహం..
శామీర్ పేట్,(విజయక్రాంతి): రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. సహజంగా పారే కాలువను కూడా వదలడం లేదు. మూడు చింతలపల్లి మున్సిపాలిటీ లోని చిన్న పర్వతాపూర్ రెవెన్యూ కు ఆనుకుని ఉన్న పోతారం ఇరిగేషన్ కాలువ కనుమరుగైపోతుంది. కొందరు రియాల్టర్లు లేఅవుట్లు, అభివృద్ధిలో భాగంగా రాత్రులు వాగులో టిప్పర్లతో మట్టి, బండరాళ్లు డంపు చేసి కాలువను కనబడకుండా చేస్తున్నారని పలు విమర్శలు వినిపిస్తున్నాయి. చిన్న పర్వతాపూర్ రెవెన్యూ పరిధిలో ఉన్న పోతారం వాగును రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా బండరాళ్లు మట్టి వేసి కాలువను కబ్జా చేసిన ఘటన కలకలం రేపుతుంది.
సహజంగా నీటి ప్రవాహానికి మార్గమైన వాగును బండ రాళ్లు, మట్టితో కప్పి రియల్ ఎస్టేట్ అనే పేరుతో భూసేకరణ ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కేవలం కాలువలతోనే పోతుంది. ఇలాగే వదిలేస్తే చెరువులు కుంటలను కూడా కబ్జా చేస్తారు అని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇలా కాలువలను కబ్జా చేయడం వల్ల భవిష్యత్తులో నీటిపారుదల వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు సంబంధిత ఇరిగేషన్ అధికారులకు తెలియకుండానే రాత్రివేళలో రియాల్టర్ వ్యాపారులు వాగులో టిప్పర్ల సహాయంతో బండరాళ్లు, మట్టి వేసి పూడ్చివేత చేస్తున్నట్లు చెబుతున్నారు. ఎవరైనా చెరువులు, కుంటలు, వాగులు, కాలువలు ఆక్రమించిన వారిపై సంబంధిత ఇరిగేషన్ అధికారులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి చట్టరీత్య చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. కాగా చిన్న పర్వతాపురం రెవెన్యూ పోతారం వాగును అక్రమించిన వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే...
ఫిర్యాదులు అందుకోవడంతో సరి... చర్యలు మాత్రం శూన్యం
చిన్న పర్వతారపురం రెవెన్యూ పోతారం వాగును కొంతమంది రియల్ టర్లు అక్రమంగా కబ్జా చేసి బండరాళ్లు,మట్టి వేసి ఆక్రమించిన విషయం పై సంబంధితశాఖల అధికారులు మున్సిపల్, రెవెన్యూ అధికారులకు నోటీసులు పంపించిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారితీస్తుంది. ప్రభుత్వ వాగులను చెరువులను, కుంటలను కాపాడా ల్సిన అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వంత పాడటం ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. సహజ వాగులను కాపాడాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహ రించడంపై రైతులు మండిపడుతున్నారు. ఈ అక్రమాలపై తక్షణమే చర్యలు చేపట్టి వాగును పూడ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున దర్నాలు నిరస నలు చేపడుతామని రైతులు హెచ్చరిస్తున్నారు.






