13 May, 2026 | 3:49 AM

పోస్టర్ ఆవిష్కరణ

13-05-2026 12:00 AM

మహబూబాబాద్, మే 12 (విజయక్రాంతి): చైతన్య సారస్వత పరిషత్ సౌజన్యంతో శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమహేంద్రవరంలో  నిర్వహించనున్న 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభల పోస్టర్ను జిల్లా అదనపు కలెక్టర్ కె. అనిల్ కుమార్, డిపిఆర్‌ఓ రాజేంద్రప్రసాద్, గుర్రపు సత్యనారాయణలతో కలిసి మంగళవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతిని భావితరాలకు అందించేందుకు ఇలాంటి సాహిత్య మహాసభలు ఎంతో దోహదపడతాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషాభిమానులు, కవులు, రచయితలు, కళాకారులను ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు.

శ్రీ శ్రీ కళావేదిక కార్యదర్శి, కవి, రచయిత గుర్రపు సత్యనారాయణ మాట్లాడుతూ, వచ్చే నెల 6,7 తేదీలలో జరగనున్న ఈ మహాసభలకు దేశ విదేశాల నుండి ప్రముఖ కవులు, రచయితలు, సాహితీవేత్తలు హాజరవుతారని తెలిపారు. కవి సమ్మేళనం, పుస్తక ఆవిష్కరణలు, సాహిత్య చర్చా గోష్ఠులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో కవులు రేణుకుంట్ల లక్ష్మి కాంతారావు, బాణాల వీరయ్య బొడ్డు పల్లి పాపయ్య పాల్గొన్నారు.