13 April, 2026 | 4:52 AM

మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి

13-04-2026 02:45 AM

ఎంపీ మల్లు రవికి వినతి

రంగారెడ్డి, ఏప్రిల్ 12(విజయక్రాంతి): మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులకు చట్టసభల్లో సముచిత స్థానం కల్పించి, దశాబ్దాలుగా కొనసాగుతున్న రాజకీయ అన్యాయాన్ని తొలగించాలని గిరిజన హక్కుల నాయకులు డిమాండ్ చేశారు.

ఆదివారం  రాష్ట్ర గిరిజన సేవా సంఘం అధ్యక్షుడు హన్మనాయక్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం పార్లమెంట్ సభ్యులు మల్లు రవిని కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.రాబోయే నియోజకవర్గాల పునర్విభజనలో కేవలం ఏజెన్సీ ప్రాంతాలకే పరిమితం కాకుండా, జనాభా ప్రాతిపదికన మైదాన ప్రాంత గిరిజనులకు అసెంబ్లీ, ఎంపీ స్థానాలను కేటాయించాలని కోరారు. తెలంగాణలో లంబాడ, ఎరుకల వంటి తెగలు మైదాన ప్రాంతాల్లో మెజార్టీ సంఖ్యలో ఉన్నప్పటికీ, రిజర్వేషన్లు దక్కక చట్టసభలకు వెళ్లే అవకాశాన్ని కోల్పోతున్నారు.

ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ’జీరో అవర్’ ద్వారా ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని, అవసరమైతే రాజ్యాంగ సవరణ కోసం ఒత్తిడి తేవాలని కోరారు.భౌగోళిక ప్రాంతం కంటే జనాభా సాంద్రతను ప్రాతిపదికన తీసుకున్నప్పుడే మైదాన ప్రాంత గిరిజనులకు నిజమైన రాజకీయ న్యాయం జరుగుతుందని ఆయన కోరారు. గిరిజన నాయకుల విజ్ఞప్తిపై ఎంపీ మల్లు రవి సానుకూలంగా స్పందించారు. మైదాన ప్రాంత గిరిజనుల రాజకీయ ప్రాతినిధ్యంలో ఉన్న చట్టపరమైన ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, వారి ఆకాంక్షలు నెరవేరేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు గిరిజన సంఘాల నాయకులు మరియు సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.