4 May, 2026 | 12:55 AM

మోదీ సభతో తెలంగాణలో రాజకీయ వేడి

03-05-2026 12:00 AM

బీజేపీ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

నాగోల్, మే 2 (విజయక్రాంతి): సికింద్రాబాద్లో నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ సభ తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు తీసుకురానుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి తెలిపారు. మే 10న పరేడ్ గ్రౌండ్స్లో జరిగే జన ఆగ్రహ సభను ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

నాగోలు డివిజన్లోని శుభం కన్వెన్షన్ హాల్లో బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల సురేంద్రనాథ్ యాదవ్ ఆధ్వర్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గ కార్యకర్తల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జి. కిషన్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ హాజరై కార్యకర్తలకు మార్గదర్శనం చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ ను మోదీ సభ మరింత బలపరుస్తుందని అన్నారు. ప్రతి కార్యకర్త బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ సభ విజయవంతానికి కృషి చేయాలని సూచించారు.

కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయని పేర్కొన్నారు. ఎంపీ ఈటెల రాజేం దర్ మాట్లాడుతూ, బీజేపీ ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్న పార్టీ అని చెప్పారు. ఇతర పార్టీల్లో కుటుంబ పాలన కొనసాగుతుండగా, బీజేపీలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు ఉంటాయని అన్నారు. దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టే దిశగా ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, సామ రంగారెడ్డి, చింతల అరుణ సురేందర్ యాదవ్, ఎల్బీనగర్ డివిజన్ల బీజేపీ మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.