5 August, 2026 | 2:43 AM

పోలీసుశాఖ ఆధ్వర్యంలో పోలీస్ నియామక శిక్షణ

05-08-2026 01:50 AM

జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

భూపాలపల్లి టౌన్, ఆగస్టు 4 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖ, ఎస్పీఎఫ్ జైళ్ల శాఖ తదితర విభాగాల్లో సుమారు 7,112 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వచ్చిందని ఈ సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా నిరుద్యోగ యువతకు పోలీసు ఉద్యోగాలు సాధించేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఉచిత వసతితో కూడిన పోలీస్ నియామక శిక్షణ నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని పేద, గ్రామీణ, గిరిజన, మారుమూల ప్రాంతాల యువతకు నాణ్యమైన శిక్షణ అందించి పోలీసు ఉద్యోగాలకు సిద్ధం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ శిక్షణలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు, అర్హత కలిగిన ఫిజికల్ ట్రైనర్ల ఆధ్వర్యంలో ఉచితంగా అందించడంతో పాటు ఉచిత వసతి, తరగతి బోధన, శారీరక శిక్షణ కల్పించనున్నట్లు తెలిపారు.

ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 4 నుండి 15వ తేదీ వరకు తమ సమీప పోలీస్ స్టేషన్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మహిళా అభ్యర్థులు కూడా ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని కోరారు. శిక్షణ ప్రారంభ తేదీ, శిక్షణా కేంద్రం, ఇతర పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా మీడియా ద్వారా వెల్లడిస్తామని తెలిపారు. పోలీసు ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్న ప్రతి యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని క్రమశిక్షణతో శ్రమించి తెలంగాణ పోలీసు శాఖలో ఉద్యోగం సాధించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఈ సందర్భంగా ఎస్పీ ఆకాంక్షించారు.