ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు
సుల్తానాబాద్, జులై 30 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని మార్కండేయ కాలనీలో గల బాలసదన్ చిల్డ్రన్ హోమ్ నుండి ఈనెల 29న బుధవారం తెల్లవారుజామున ఇద్దరు మైనర్ బాలికలు హాస్టల్ ప్రాంగణంలోని కాంపౌండ్ గోడ దూకి వెళ్లిపోయిన విషయం తెలియగానే, పెద్దపల్లి డీసీపీ శ్రీ రామ్ రెడ్డి ఆదేశాల మేరకు వెంటనే ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది. ఈ మేరకు నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి, ఒక బృందాన్ని పెద్దపల్లి, మరో బృందాన్ని కరీంనగర్, మరో బృందాన్ని స్థానికంగా సమాచార సేకరణకు, ఇంకో బృందాన్ని బాలికల్లో ఒకరి బంధువుల గ్రామమైన పాలితం ప్రాంతానికి పంపించి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, ప్రయాణ మార్గాలు మరియు ఇతర సమాచారాన్ని విశ్లేషించగా, బాలికలు సుల్తానాబాద్ చౌరస్తాకు చేరుకుని అక్కడి నుండి ఆటోలో పెద్దపల్లి రైల్వే స్టేషన్‌కు వెళ్లి, అక్కడ నుండి రైలులో భువనగిరికి చేరుకుని, అనంతరం బస్సులో నల్గొండకు వెళ్లినట్లు గుర్తించారు. అనంతరం నల్గొండ బస్టాండులో ఉన్న ఇద్దరు బాలికలను పోలీసులు తప్పిపోయిన 12 గంటల వ్యవధిలోనే సురక్షితంగా గుర్తించి రక్షించారు.
అనంతరం వారిని భద్రంగా తీసుకువచ్చి సంబంధిత అధికారులకు చట్టపరమైన విధానంలో అప్పగించారు. ఈ ఆపరేషన్‌లో సుల్తానాబాద్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పొన్నమనేని రంజిత్ రావు, సుల్తానాబాద్ ఎస్‌హెచ్‌ఓ చంద్రకుమార్, హెడ్ కానిస్టేబుళ్లు మహేందర్, కానిస్టేబుళ్లు వెంకటేష్, రవి, రమేష్, అరుణ్, సదానందం రేణుక అలాగే టెక్నికల్ టీమ్ సభ్యులు సమన్వయంతో పనిచేసి బాలికలను వేగంగా గుర్తించి రక్షించడంలో కీలక పాత్ర పోషించారు.ఈ సందర్భంగా డీసీపీ శ్రీ రామ్ రెడ్డి ఆపరేషన్‌లో పాల్గొన్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పొన్నమనేని రంజిత్ రావు, ఎస్‌హెచ్‌ఓ చంద్రకుమార్, పోలీసు సిబ్బంది మరియు టెక్నికల్ టీమ్‌ను ప్రత్యేకంగా అభినందించారు.






