28 February, 2026 | 6:00 PM

హెచ్‌పీవీ వాక్సిన్ డ్రైవ్ ప్రారంభించిన ప్రధాని మోడీ

28-02-2026 01:28 PM

జైపూర్: 14 సంవత్సరాల వయస్సు గల బాలికలలో గర్భాశయ క్యాన్సర్‌ను(Cervical cancer) నివారించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) టీకా ప్రచారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) శనివారం రాజస్థాన్‌లో ప్రారంభించారు. అజ్మీర్‌లోని కయాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో గర్భాశయ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేశారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి లబ్ధిదారులతో కూడా సంభాషించారు. అధికారుల ప్రకారం, ఈ ప్రచారం కింద సింగిల్-డోస్ "గార్డసిల్ 4" వ్యాక్సిన్, క్వాడ్రివాలెంట్ హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఉపయోగించబడుతుంది. ఈ ఇంజెక్షన్ గర్భాశయ క్యాన్సర్‌కు కారణమైన హెచ్‌పీవీ రకాలు 6, 11, 16, 18, నుండి రక్షణను అందిస్తుంది. గర్భశయ ముఖద్వార క్యాన్సర్ నివారణే లక్ష్యంగా కేంద్ర ఆరోగ్య శాఖ(Union Health Ministry) 14,15 ఏళ్ల బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ టీకాలు ఇస్తోంది. దేశంలో 1.15 కోట్ల మంది బాలికలకు టీకాలు ఇవ్వనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

"దేశవ్యాప్తంగా ఉన్న 14 ఏళ్ల బాలికలందరికీ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు (Ayushman Health Centers), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఉప-జిల్లా, జిల్లా ఆసుపత్రులు, ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులతో సహా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో 'గార్డసిల్ 4' వ్యాక్సిన్‌ను ఒకే మోతాదులో వేస్తారు" అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 25న అన్ని రాష్ట్రాలకు పంపిన అధికారిక ప్రకటనలో పేర్కొంది.