28 July, 2026 | 2:25 AM

అధికారుల అండతోనే వసూళ్లు!

28-07-2026 01:37 AM
  1. రెవెన్యూ ఉద్యోగుల తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
  2. ‘విజయక్రాంతి’ కథనంపై నంగునూరు మండలంలో జోరుగా చర్చ
  3. అధికార పార్టీ నేతలనూ వదలని వైనం

నంగునూరు, జులై 27: నంగునూరు మండల రెవెన్యూ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి,అక్రమ వసూళ్లపై విజయక్రాంతి దినపత్రికలో వెలువడిన వార్తా కథనం స్థానికంగా జోరుగా చర్చా జరుగుతుంది.ఈ వ్యవహారంపై ఎమ్మార్వో స్వయంగా సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి తగు సూచనలు చేసినట్లు సమాచారం.

మీడియాలో వచ్చిన కథనంతో కొందరు మార్పు దిశగా ఆలోచిస్తుండగా,మరికొందరు సిబ్బంది మాత్రం తమ పాత పద్ధతులను మార్చుకోకుండా,ఏకంగా అధికార పార్టీ నేతలను సైతం వదలకుండా యథావిధిగా వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శలు వెలువడుతున్నాయి.

కాగా,కార్యాలయంలో జరుగుతున్న అవినీతిని ఎత్తిచూపుతూ మీడియాలో కథనం రావడం అభినందనీయమని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈసారైనా సంబంధిత సిబ్బంది తమ తీరు మార్చుకుని,కార్యాలయంలోని అక్రమాలకు పూర్తిగా తెరదించుతారని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.