8 July, 2026 | 4:37 AM

విద్యార్థుల జీవితాలతో ఆటలు!

08-07-2026 12:00 AM

బాన్సువాడలో 8,9 తరగతులకు అనుమతులు లేకున్నా ప్రవేశాలు..

శ్రీ చైతన్య ప్రైవేట్ పాఠశాలపై విచారణ చేపట్టిన ఎంఈఓ నాగేశ్వరరావు..

రెండు మూడు రోజుల్లో అనుమతులు రాకుంటే ఇతర పాఠశాలలకు విద్యార్థులు..

బాన్సువాడ, జూలై 7 (విజయక్రాంతి): విద్యార్థుల జీవితాలతో, భవిష్యత్తుతో చెలగాటమాడుతూ, విద్యార్థుల తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తూ అనుమతులు లేకుండా తరగతులు కొనసాగుతున్నాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో 8 9వ తరగతిలకు సంబంధించిన ప్రభుత్వ అనుమతులు లేకుండానే విద్యార్థులను ప్రవేశాలు చేపడుతున్నారని ఆరోపణల నేపథ్యంలో మండల విద్యాశాఖ అధికారి ఆకస్మికంగా తనిఖీ చేసి విచారణ చేపట్టారు.

రెండు,మూడు రోజుల్లో అనుమతులు రాకుంటే  తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులను వేరే పాఠశాలకు పంపించడం జరుగుతుందని హెచ్చరించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య, 8, 9 తరగతుల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏజీఎం, తదితరులతో చరవాణిలో మాట్లాడారు.

అనుమతులు లేకుండా తరగతులు ఎలా కొనసాగిస్తున్నారని, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సంవత్సరం సైతం ఈ పాఠశాలలో అనేక నిరసనలు ఉద్యమాలను విద్యార్థి సంఘాల నాయకులు చేపట్టిన విద్యాశాఖ అధికారులు ఎలాంటి చలనం లేకుండా పోయిందని పలువురు ఆరోపించారు. దర్జాగా అనుమతులు లేకుండా సుమారు నెలరోజులు కావస్తున్న తరగతులు కొనసాగుతున్నాయని వెంటనే చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

పాఠశాలలు ప్రారంభమై తరగతులు కొనసాగుతుండడంతో రాబోయే రోజుల్లో విద్యార్థులకు తీవ్ర అవస్థలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని అనుమతులు లేకుండా తరగతులు కొనసాగడంతో భవిష్యత్తులో విద్యార్థులకు బోనాఫైడ్ టీసీ తదితర వాటిని ఏ స్కూల్ పై ఇస్తారు అర్థంకాని పరిస్థితి నెలకొంటుందని ఇదంతా విద్యార్థుల తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు. 

తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త..

విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటికైనా పూర్తిస్థాయిలో పాఠశాలల గురించి తెలుసుకొని తమ తమ చిన్నారులను చేర్పించాలని అనుమతులు లేకుండా కొనసాగుతున్న పాఠశాలలో చేర్పించి భవిష్యత్తులో ఇబ్బందులకు గురికావద్దని పలువురు పేర్కొంటున్నారు. 

రెండు, మూడు రోజుల్లో అనుమతి రాకుంటే చర్యలు..

రెండు, మూడు రోజుల్లో శ్రీ చైతన్య పాఠశాలలో 8, 9 తరగతులకు అనుమతులు రాకుంటే విద్యార్థులను వేరే పాఠశాలకు పంపిస్తామని మండల విద్యాశాఖ అధికారి హెచ్చరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం అనుమతులు ఉన్న పాఠశాలలోనే తమ తమ చిన్నారులను చేర్పించాలన్నారు.

ఎంఈఓ నాగేశ్వరరావు