2 July, 2026 | 2:20 AM

ఖరీఫ్ ధాన్యం సేకరణకు ప్రణాళిక

02-07-2026 01:15 AM

ధాన్యం నిల్వలు, రవాణా, ఆర్థిక వ్యవస్థలను పూర్తిగా ప్రక్షాళన

మిషన్ కే 100 ప్రారంభించిన స్టీఫెన్ రవీంద్ర 

హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): రాబోయే 2026- ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం సేకరణ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగేలా చూడడానికి, తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ బుధవారం మిషన్ కె-100 (వంద రోజుల ప్రణాళిక)ను ప్రారంభించింది.

ఖరీఫ్ పంట చేతికి వచ్చేలోపు రవాణా, ఆర్థికపరమైన అడ్డంకులను వెంటనే పరిష్కరించడమే ప్రధాన ఉద్దేశమని పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. బుధవారం సివిల్ సప్లయ్ కార్యాలయంలో కమిషనర్ స్టీపెన్ రవీంద్ర ఉన్నతాధికా రులతో సమావేశం, జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం నిల్వల తరలింపును వేగవంతం చేయడానికి, భాగస్వాములందరి మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడానికే 100 రోజుల ప్రణాళిక అని తెలిపారు.

కొత్త పంట కొనుగోలు కేంద్రాలకు చేరుకునేలోగా రాష్ట్రంలోని ధాన్యం నిల్వలు, రవాణా, ఆర్థిక వ్యవస్థలను పూర్తిగా ప్రక్షాళన చేయడమే ఈ బృహత్తర కార్యక్రమం లక్ష్యమన్నారు. నిధులను సమకూర్చుకోవడంతో పాటు గోదాముల అద్దె భారాన్ని తగ్గించుకోవడం, ధాన్యాన్ని ఒక క్రమపద్ధతిలో దశలవారీగా వేలం వేయడంపై ఇది ప్రధానంగా దృష్టి సారిస్తుందన్నారు. కూలీలపై ఆధారపడటాన్ని తగ్గించడం, రవాణా రంగాలను విస్తరించడం, అవసరమైన వాహనాలను పెంచడం, కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల మధ్య రవాణా అడ్డంకులను తొలగించడానికి వాహనాల ఉనికిని ఎప్పటికప్పుడు పసిగట్టే వ్యవస్థను వినియోగంలోకి తీసుకురావడం ద్వారా రవాణా వ్యవస్థ బలోపేతం చేయడా నికి ఉపయోగ పడుతుందని తెలిపారు.