2 July, 2026 | 3:25 AM

ప్రముఖ వైద్యులు రాజారాం, శంకర్‌కు సన్మానం

02-07-2026 02:14 AM

ముస్తాబాద్,జూలై 1( విజయ క్రాంతి )రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పీపుల్స్ హాస్పిటల్ ప్రముఖ వైద్యులు డాక్టర్ రాజారాం,డాక్టర్ శంకర్ డాక్టర్,డాక్టర్ అర్చన,డాక్టర్ క్రాంతి కుమార్ లను జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య సిరిసిల్ల సాహిత్య సమితి కవులు, రచయితలు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా బుధవారం శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి మెమెంటోను అందజేశారు.

ఈ సందర్బంగా జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ శంకరయ్య మాట్లాడు తూ వైద్యులు డాక్టర్ శంకర్ ఎంతోమంది పేద ప్రజల ప్రాణాలు కాపాడరని,ఆయన చేతులపై ఎంతోమంది పురుడు పోసుకున్న వారికి దైవ సమానులని కొనియాడారు. ఎన్నో మైలురాళ్ళను ఎదుర్కొని లక్షకు పైగా శస్త్ర చికిత్సలు చేసి ప్రాణాలు కాపాడి కనిపించే దేవుడని పేర్కొన్నారు. పల్లె ప్రజలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలనే లక్ష్యంతోనే నగరాలకు వెళ్లకుండా తన సొం త గ్రామం ముస్తాబాద్ లో వైద్య సేవలు అందించడం గొప్ప విషయమన్నారు.

నేను అనారోగ్యం కారణంగా ఎంతోమంది వైద్యులను  సంప్రదించినా నయం కాలేదని, ఆలస్యం చేయకుండా శంకర్ సారు దగ్గర సుదీర్ఘంగా వైద్య సేవలు తీసుకొని ఈ రోజు ఆరోగ్యంగా మీ ముందు మాట్లాడుతున్నానని వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు.అనంతరం సిరిసిల్ల సాహిత్య సమితి మేరోజు రమేష్,కవి జుకంటి జగన్నాధం, ప్రధాన కార్యదర్శి వెంగల లక్ష్మణ్ తమ కవితా రచనలతో వైద్యుల గురించి గొప్పగా వర్ణించారు.కరోనా మహమ్మారి విజృంభించిన క్లిష్ట సమయంలో కూడా అత్యవసర  మెరగైన వైద్య సేవలు అందించిన గొప్ప మనసున్న వైద్యులుగా గుర్తింపు పొందారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో చింతోజు నారాయణ ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.