4 May, 2026 | 2:10 AM

కస్టడీలో ఫోన్..ఖాతా ఖాళీ

04-05-2026 12:58 AM
  1. కరీంనగర్ ఘటన వెనుక అసలు మర్మమేంటి?
  2. డిజిటల్ భద్రత, పోలీసు విధానాలపై పెద్ద ప్రశ్నార్థకం

కరీంనగర్, మే3(విజయక్రాంతి): టెక్నాలజీ యుగంలో నేరాల స్వరూపం మారిపో తున్న తరుణంలో, కరీంనగర్లో వెలుగుచూసిన ఒక ఘటన సంచలనంగా మారింది. పోలీసుల కస్టడీలో ఉన్న సెల్ఫోన్ ద్వారా లక్షల రూపాయలు మాయం కావడం ప్రజ ల్లో ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా పోలీసుల స్వాధీనం లో ఉన్న వస్తు వులు సురక్షితంగా ఉంటాయని భావిస్తాం. కానీ ఈ ఘటన ఆ నమ్మకాన్ని సవాల్ చేస్తోంది. కరీంనగర్కు చెందిన మహేందర్ అనే వ్యక్తిని గతేడాది డిసెంబర్ 4న ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

రి మాండ్కు పంపించే ముందు అతని మొబైల్ ఫోన్ను పోలీసులు సీజ్ చేశారు. దాదాపు మూడు నెలల తర్వాత మార్చి 26న బెయ్పి బయటకు వచ్చిన మహేందర్ తన బ్యాంకు ఖాతాను తనిఖీ చేయగా షాక్కు గురయ్యా డు. ఫిబ్రవరి 19, మార్చి 17 తేదీల్లో రెండు విడతలుగా సుమారు ఆరు లక్షల రూపాయలకు పైగా నగదు అతని ఖాతా నుండి బదిలీ అయినట్లు గుర్తించాడు. ముఖ్యంగా ఈ లా వాదేవీలు పోలీసుల వద్ద ఉన్న అతని ఫోన్ ద్వారానే జరగడం ఈ కేసులో అత్యంత కీలక అంశంగా మారింది.

ఈ ఘటనలో అనుమానాలు అనేకం. ఫోన్ పోలీసు కస్టడీలో ఉండ గా ట్రాన్సాక్షన్లు ఎలా జరిగాయి? ఓటీపీ లు ఎవరి చేతికి చేరాయి? ఫోన్ పాస్వర్డ్ లేదా బ్యాంకింగ్ యాప్ యాక్సెస్ ఎవరికుంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ ఇది సైబర్ నేరగాళ్ల పని అయితే సిం క్లోనింగ్ లేదా మాల్వేర్ ద్వారా జరిగి ఉండవచ్చు. లేదంటే తెలిసిన వ్యక్తులు పాస్వర్డ్లు తెలుసుకుని ఈ దోపిడీకి పాల్పడి ఉండవచ్చు. మరోవైపు పోలీసుల నిర్లక్ష్యం లేదా అంతర్గత దుర్వినియోగం కోణం కూడా పరిశీలనలో ఉంది.ఇంతటితో కాకుండా, మహేందర్ ఇంట్లో కూడా దొంగతనం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. సుమారు 157 గ్రాముల బంగారం, వెండి వస్తువులు, హార్డ్డిస్కులు, చెక్బుక్స్ కనిపించకుండా పోయాయని ఆయన చెబుతున్నారు.

దీనివల్ల ఈ కేసు కేవలం సైబర్ మోసం మాత్రమే కాకుండా, భౌతిక దొంగతనం కూడా కలిసిన క్లిష్టమైన ఘటనగా మారింది.బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నగదు బదిలీ అయిన కొన్ని అనుమానాస్పద ఖాతాలను ఇప్పటికే గుర్తించి సీజ్ చేశారు. ఒక ఖాతాలో ఉన్న రూ.50 వేల విత్డ్రాను కూడా నిలిపివేశారు. ఫోన్ ద్వారా లావాదేవీలు ఎలా జరిగాయనే దానిపై సాంకేతిక విశ్లేషణ జరుగుతోంది. ఈ ఘటన చట్టపరమైన ప్రశ్నలను కూడా లేవనెత్తుతోంది. కస్టడీలో ఉన్న వస్తువుల భద్రతకు పోలీసులే బాధ్యత వహించాలా? ఈ నిర్లక్ష్యం వల్ల జరిగిన నష్టానికి బాధితుడికి పరిహారం లభిస్తుందా? అనే అంశాలు న్యాయపరంగా చర్చనీయాంశంగా మారాయి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, కస్టడీలో ఉన్న వస్తువుల నుంచి నష్టం జరిగితే అది బాధ్యతగా పరిగణించే అవకాశముంది.డిజిటల్ యు గంలో ఈ ఘటన ప్రతి ఒక్కరికి ఒక హెచ్చరికగా నిలుస్తోంది. మొబైల్లో బ్యాంకింగ్ యాప్స్ ఉపయోగించే వారు బలమైన పాస్వర్డ్లు, బయోమెట్రిక్ భద్రత, (ఓటిపి) రక్షణ వంటి అంశాలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. అనివార్య పరిస్థితు ల్లో బ్యాంక్ ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేయడం వంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.మొత్తానికి, కరీంనగర్ ఘటన ‘సీజ్’ అంటే సురక్షితం అనే భావనపై పెద్ద ప్రశ్నార్థకాన్ని లేవనెత్తింది. పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం నిలుపుకోవాలంటే పారదర్శకంగా, వేగంగా దర్యాప్తు పూర్తి చేసి అసలు నిందితులను బయటపెట్టాల్సిన అవసరం ఉంది. అప్పటివరకు ఈ ఘటన టెక్నాలజీ యుగంలో మరో మిస్టరీగానే మిగిలిపోనుంది.