4 May, 2026 | 2:11 AM

మోదీ సభకు స్వచ్ఛందంగా తరలిరండి

04-05-2026 01:00 AM
  1. కనీవినీ ఎరగని రీతిలో సభను సక్సెస్ చేద్దాం
  2. కరీంనగర్ నుండి అధిక సంఖ్యలో తరలిద్దాం
  3. సభ సక్సెస్‌తో ప్రజల్లోకి బీజేపీ విజయ సంకేతాలు పంపిద్దాం
  4. బీజేపీ శ్రేణులకు కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్ పిలుపు
  5. జిల్లా పార్టీ నేతలతో బండి సంజయ్ సమావేశం
  6. కరీంనగర్ లో బీజేపీ జిల్లా కార్యాలయ నూతన భవనానికి కేంద్ర మంత్రి భూమిపూజ
  7. మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లుసహా ముఖ్య నేతల హాజరు

ముకరంపుర, మే3(విజయక్రాంతి):ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 10న హైదరాబాద్ రానున్న నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభను కనీవినీ ఎరగని రీతిలో విజయవంతం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రతి కార్యకర్త స్వచ్ఛందంగా సభకు తరలిరావాలని కోరారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా నుండి అత్యధిక సంఖ్యలో ప్రజలను తరలించాలని జిల్లా పార్టీ నేతలకు సూచించారు. ఆదివారం ఉదయం కరీంనగర్ లోని గాయత్రీనగర్ లో బీజేపీ జిల్లా కార్యాలయ నూతన భవన నిర్మాణానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ భూమి పూజ చేశారు.

ఈ భూమి పూజ కార్యక్రమానికి బీజేపీ కార్పొరేటర్లతోపాటు జిల్లాలోని పార్టీ నాయకులంతా భారీ ఎత్తున తరలివచ్చారు. వారందరితో కలిసి భూమి పూజ నిర్వహించిన బండి సంజయ్ అనంతరం జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో గాయత్రి బ్యాంకెట్ హాలులో జిల్లా మండలాధ్యక్షులు, ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్నారు. ఈనెల 10న ప్రధానమంత్రి నరేంద్రమోదీ మోదీ సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించే సభకు రానున్న నేపథ్యంలో, బహిరంగ విజయవంతం, జన సమీకరణపై ఆయా నేతలతో చర్చించారు.

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, పార్టీ సీనియర్ నేతలు బాస సత్యనారాయణ, కోమాల ఆంజనేయులు, గుగ్గిళ్ల రమేశ్, నల్లాల ఒదేలు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆపరేషన్ సింధూర్ తరువాత తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారని 3వ సారి ప్రధాని పగ్గాలు చేపట్టిన తరువాత హైదరాబాద్ తొలిసారి రాబోతున్నారని. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి బీజేపీ కార్యకర్త స్వచ్ఛందంగా తరలిరావాలి. కరీంనగర్ జిల్లా నుండి వేల సంఖ్యలో జన సమీకరణ చేద్దామన్నారు. వేలాది సంఖ్యలో ప్రజలను పరేడ్ మైదానానికి తరలిద్దామన్నారు.

బీజేపీ నాయకులంతా తమ అనుచరులు, టీంతో తప్పనిసరిగా పరేడ్ మైదానానికి తరలి రావాలని. ప్రతి ఒక్కరూ మోదీ సభకు ఆహ్వానిస్తూ మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించాలని. మీ గ్రామాలు, వార్డులు, మండలాల పరిధిలో వాల్ రైటింగ్ రాయించా సభాలన్నారు.సభ కు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్న వారికి తగిన రవాణా, భోజన సౌకర్యాలు కల్పించాలని మోదీ సభ సక్సెస్ తో రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ విజయం తథ్యమనే సంకేతాలు పంపుదామన్నారు.