ప్రశాంతంగా నీట్ పరీక్ష
కరీంనగర్, మే3(విజయక్రాంతి):వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ పరీక్ష (నీట్) ఆదివారం కరీంనగర్ లో ప్రశాంతంగా జరిగిందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.ఆదివారం కరీంనగర్ లోని మహిళా డిగ్రీ కళాశాల, ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల, కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన నీట్ పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్ష నిర్వహణ తీరుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నీట్ పరీక్షను అత్యంత పకడ్బందీగా కరీంనగర్లో నిర్వహించామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా కోఆర్డినేటర్లతో వసతులు అభ్యర్థుల హాజరు తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కరీంనగర్లో ఏడు కేంద్రాల్లో పరీక్షలుజరిగాయని, మొత్తం 2928 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారనీ. అందులో 2865 మంది హాజరు కాగా 63 మంది గైర్హాజరయ్యారనీ తెలిపారు. మహిళా డిగ్రీ కళాశాలలో 725 మంది అభ్యర్థులు, ఎస్ ఆర్ ఆర్ డిగ్రీ కాలేజీలో 704 మంది కేంద్రీయ విద్యాలయంలో 376 మందిమహిళా పాలిటెక్నిక్ కాలేజీలో305 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజీలో 283 మంది టీజీఎస్ డబ్ల్యు ఆర్ చింతకుంట బాలికల కళాశాలలో 239 మందిసెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో 233 మంది అభ్యర్థులు పరీక్ష రాశారని పేర్కొన్నారు. అభ్యర్థులను సునిశిత పరిశీలన తర్వాతనే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు.
పోలీసులు పకడ్బందీగా తనిఖీలు చేశారు.
అన్ని పరీక్షా కేంద్రాల్లో ప్రశాంతంగా పరీక్ష జరిగినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న మొత్తం అభ్యర్థుల్లో అత్యధిక సంఖ్యలో విద్యార్థులు హాజరై పరీక్ష రాశారనీ. హాజరు శాతం సంతృప్తికరంగా నమోదయిందన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో నియమించిన నోడల్ తహసీల్దార్లు పరీక్ష నిర్వహణను సమర్థవంతంగా పర్యవేక్షించి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారనీ తెలిపారు. అదేవిధంగా విద్యాశాఖ, ట్రాఫిక్, పోలీసు, మున్సిపల్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్ష సజావుగా జరిగేలా సహకరించారనీ కలెక్టర్ తెలిపారు.జిల్లాలోని మొత్తం 7 పరీక్షా కేంద్రాల్లో బయోమెట్రిక్ హాజరు నమోదు 100 శాతం పూర్తుందన్నారు. భౌతిక హాజరు బయోమెట్రిక్ హాజరు వివరాలు పూర్తిగా సరిపోలాయనీ, మొత్తం ప్రక్రియను ఎన్టీఏ బృందంతో సమన్వయం చేస్తూ జిల్లా యంత్రాంగం పర్యవేక్షణలో పరీక్ష విజయవంతంగా పూర్తయ్యిందనీ పేర్కొన్నారు.
పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పించడంతో పాటు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు, పరిశుభ్రత వంటి అంశాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పరీక్ష ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ తెలిపారు.






