పెట్రోల్‌బంక్ వసతులు జంప్..!
- నిబంధనలకు నీళ్లు వదులుతున్న యాజమాన్యాలు
- వసుతులు లేక వాహన దారుల ఇక్కట్లు
- ప్రశ్నిస్తే ఎదురు దూషణలు, ఎటకారపు మాటలు?
- అధికారులు స్పందించి వసతులు కల్పించాలని వాహనదారుల ఆర్జీలు
సూర్యాపేట రూరల్, ఆగష్టు 17 : , జిల్లాలో పలు చోట్ల పెట్రోల్ బంక్ లలో అనుమతులు మరిచి కనీస అవసరాలు కూడ లేకుండా నిబంధనులకు వ్యతిరేకంగా బంక్ లు నడిపిస్తున్న వైనం కనపడుతుంది అని వాహనదారులు ఆరోపిస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు జాతీయ రహదారులపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. వాహనదారులకు ఇంధనం నింపడంతో పాటు, వారికి కనీస వసతులు కల్పించడం ప్రతి పెట్రోల్ బంక్ యాజమాన్య బాధ్యత. కానీ, నేడు చాలా బంకుల్లో ఈ నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి.
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా. :
పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో నిబంధనల ప్రకారం...
తాగునీటి సౌకర్యం.
గాలి యంత్రాలు.
స్త్రీ, పురుషులకు వేర్వురుగా మరుగుదొడ్లు.
ప్రథమ చికిత్స పెట్టె మరియు అగ్నిమాపక పరికరాలు.
ఇవన్నీ తప్పనిసరిగా ఉండాలని అధికారులు నిర్ధారించుకున్న తర్వాతే అనుమతులు ఇస్తారు. కానీ, బంక్ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఈ సౌకర్యాలు మూలనపడుతున్నాయి. వాహనదారులు టైర్లలో గాలి కొట్టమని అడిగితే చాలు, ‘మెషిన్ ఖరాబ్ అయింది (పాడైపోయింది)‘ అనే సమాధానం ఇక్కడ సర్వసాధారణమైపోయింది. అత్యవసర సమయాల్లో మరుగుదొడ్లను వినియోగించుకుందామంటే వాటికి తాళాలు వేసి ఉంటున్నాయి.
అడిగితే సిబ్బంది దురుసుగా సమాధానం ఇస్తున్నారు. మండుతున్న ఎండల్లో దాహం తీర్చుకోవడానికి కనీసం ఒక మంచినీళ్ల కుండ లేదా గిన్నె కూడా అందుబాటులో లేని బంకులు అనేకం ఉన్నాయి. ‘మేము డబ్బులు పెట్టి పెట్రోల్ కొనుక్కుంటున్నాం. మాకు కావాల్సింది కేవలం ఇంధనం మాత్రమే కాదు, చట్టబద్ధంగా మాకు రావాల్సిన కనీస వసతులు. అడిగితే బంక్ సిబ్బంది దురుసుగా మాట్లాడుతున్నారనీ వాహనదారుల ఆవేదన వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
ఉరుకు, పరుగులతో అడిగేవారేరి:
ప్రజలు తమ దైనందిన జీవితంలో పడి ఉరుకులు పరుగుల పైన ఉండటంతో, బంకుల్లోని ఈ లోపాలను ప్రతిసారీ ప్రశ్నించలేకపోతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని నిర్వాహకులు నిబంధనలను పూర్తిగా గాలికి వదిలేస్తున్నారనీ వాహనదారులు చెబుతున్నారు. ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి అంటున్నారు.
అధికారుల స్పందన కోసం ఎదురుచూపులు :
పెట్రోల్ బంక్ నిర్వహణ అనేది ఒక నిరంతర ప్రక్రియ. అనుమతులు తీసుకునేటప్పుడు చూపించిన వసతులు నిత్యం అందుబాటులో ఉండేలా చూసే బాధ్యత ఆయిల్ కంపెనీల అధికారులు, పౌర సరఫరాల శాఖ అధికారులపై ఉంది. అధికారులు వెంటనే స్పందించి జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలనీ కోరుతున్నారు. పెట్రోల్ బంక్ లలో గాలి, మరుగుదొడ్లు, తాగునీరు అందుబాటులో ఉండని బంకుల లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేయాలనీ పలువురు వాహనదారులు కోరుతున్నారు.
అలాగే బంకుల్లో కనీస వసతులు కల్పించకపోతే ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నంబర్లు, అధికారుల ఫోన్ నంబర్లు స్పష్టంగా కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తున్న నిర్లక్ష్యపు బంకులపై అధికారులు ఉక్కుపాదం మోపి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చెందాలని పలువురు వేడుకుంటూ.
వసతులు లేని బంక్ లపై చర్యలు తీసుకోవాలి
పెట్రోల్ బంకుల్లో ఉచితంగా ఏదీ అడగడం లేదు, లీటరుకు పూర్తి డబ్బులు చెల్లించే ఇంధనం పోయించుకుంటున్నాం. చట్ట ప్రకారం మాకు కల్పించాల్సిన ఉచిత గాలి, శుభ్రమైన తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస వసతులు కల్పించాలి. నిబంధనలు పాటించని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలి..
- కోలగాని సాయి కార్తికేయ, సూర్యాపేట






