హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత.. ఎక్కడ చూసిన నో స్టాక్ బోర్డులు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. ఏపీ, తెలంగాణలో పలు చోట్ల పెట్రోల్ బంక్‌లు మూసివేశారు. పలు జిల్లాల్లో పెట్రోల్ బంక్‌లలో నో స్టాక్ బోర్డ్‌లు దర్శనమివ్వగా, పలు చోట్ల బంక్‌లు మూతపడ్డాయి. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. ఆదివారం రాత్రి నుంచి పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ కొరత వల్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల్లో వాహనదారులు బారులు తీరారు. గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొన్నాళ్లుగా సీఎన్‌జీ కొరత
హైదరాబాద్ నగరంలో కొన్నాళ్లుగా సీఎన్‌జీ కొరత కొనసాగుతోంది. సీఎన్‌జీ కోసం బంకుల ముందు ఆటోలు బారులు తీరాయి. జిల్లాల్లోనూ పెట్రోల్, డీజిల్ దొరకటం లేదని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. పలు జిల్లాల్లో బంకుల్లో నోస్టాక్ బోర్డు ఉందని వాహనదారులు వాపోతున్నారు. కొన్ని చోట్ల పెట్రోల్ లభ్యత ఉండగా డీజిల్ కొరత ఏర్పడటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.






