calender_icon.png 23 February, 2026 | 8:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయ లబ్ధి కోసమే తెరపైకి కళాశాల ఆస్తుల నాటకం

23-02-2026 06:32:50 PM

వాస్తవాలను నిగ్గు తేల్చాలని కలెక్టర్ ను కోరాను

 తనకు ప్రాణ హాని లేదు

 రేపటినుండి ప్రాణభయం ఎలా ఉంటుందో చూపిస్తా

 కామారెడ్డి ఎమ్మెల్యే కె వెంకట రమణారెడ్డి

కామారెడ్డి,(విజయక్రాంతి): రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తుల అంశాన్ని తెరపైకి తెచ్చారని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. కలెక్టరేట్​లో సోమవారం ఆయన కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్​ రెవెన్యూ అధికారులను కలిసి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల విషయంలో నిజాలు బయట పెట్టాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం పత్రికా విలేకరులతో  మాట్లాడారు. డిగ్రీ కళాశాల ఆస్తుల విషయంలో తాను, తన తండ్రి ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని ఎమ్మెల్యే కేవీఆర్​అన్నారు. నిజాయితీగా ఉన్నవాళ్లకు భయం ఉండదని పేర్కొన్నారు.

ప్రభుత్వంలో వాళ్లే ఉన్నారని, రెండు నిమిషాలలో డాక్యుమెంట్స్ తెప్పించే అధికారం ఉందన్నారు. అలాంటపుడు ఈ రచ్చ ఎందుకు.. గొడవ ఎందుకు అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. 2004 నుంచి 2009 వరకు మంత్రిగా ఉన్న షబ్బీర్ అలీ నాడు ఏమి చేయలేదని, ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఆయన సీఎం ద్వారా రికార్డులు తెప్పించుకోవచ్చని తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. దీనికి కచ్చితంగా ముగింపు పలుకుతానని తెలిపారు.

263 ఎకరాల్లో భూమిలో 1964 నుంచి ఇప్పటివరకు ఏ భవనానికి ఎంత స్థలం కేటాయించారు ప్రజా ప్రయోజనాల కోసం చేసారాస్వార్థ ప్రయోజనాల కోసం చేసారా అనేది నిగ్గు తేల్చాలని కలెక్టర్​ను కోరాను’ అని ఎమ్మెల్యే తెలిపారు. కళాశాల ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా భూ సేకరణ చేయడం వల్లే కామారెడ్డిలో అన్ని రకాల ప్రభుత్వ భవనాలు, కళాశాలలు వచ్చాయని, లేకపోతే కామారెడ్డి లో ఏమి ఉండేవి కాదన్నారు. 2004-09 వరకు మంత్రిగా ఉన్న షబ్బీర్ అలీ తెలంగాణ యూనివర్సిటీని కామారెడ్డికి తెచ్చే దమ్ము, తెలివి లేదా అని ప్రశ్నించారు.

నియోజకవర్గంలో ఒక మండలానికి మోడల్ స్కూల్ తీసుకు రాలేదని ఆయన ఆరోపించారు. తాను జడ్పీ చైర్మన్గా ఉన్న కాలంలో సదాశివ నగర్ మండలానికి మోడల్ స్కూల్ ను తీసుకురావడం జరిగిందని గుర్తు చేశారు. కర్షక బీఈడీ కళాశాల ఇంజనీరింగ్ కళాశాల హైదరాబాద్ వెళ్ళిపోతే ఏమి చేశారని షబ్బీర్ అని ప్రశ్నించారు.8.20 ఎకరాల కళాశాల మైదానం దున్నుతే దాని వెనకాల ఉన్నది ఎవరని నిలదీశారు. తెర వెనుక రాజకీయ శక్తులు లేకపోతే ఇతర ప్రాంతాల వారు కళాశాల భూమిపై కన్ను ఎలా వేస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటికీ కామారెడ్డిలో ఆరుగురు బిజెపి కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారని తనను శాంతి భద్రతల సమస్య వస్తుందని ఇంట్లోనే ఉంచారని కాంగ్రెస్ వాళ్లను మాత్రం ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. దీనిని బట్టి చూస్తే పోలీసులు అవలంబిస్తున్న తీరు స్పష్టమవుతుందన్నారు. తనకు ప్రాణభయం లేదని రేపటి నుండి వాళ్లకు ప్రాణభయం ఎలా ఉంటుందో చూపిస్తానని హెచ్చరించారు. ఉండేది ఒక రోజు పోయేది ఒక రోజే కాబట్టి నేను పోయేముందు నాతో పాటు పదిమందిని తీసుకెళ్తానని ఆగ్రహంతో  ఆయన హెచ్చరించారు.