4 May, 2026 | 10:20 PM

మా గ్రామంలో అన్ని సమస్యలే

04-05-2026 08:58 PM

- ఎంపీఓ కు బయ్యారం గ్రామస్తుల వినతి 

గజ్వేల్:  బయ్యారం గ్రామంలో అన్ని సమస్యలే ఉన్నాయని, అధికారులు కల్పించుకుని వెంటనే సమస్యలను పరిష్కరించాలని బిఆర్ఎస్వీ నాయకులు పంగ మోహన్ బాబు, గ్రామస్తులు ఎంపీఓ దయాకర్ కు వినతి పత్రం అందజేశారు. తమ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి సరిగా పనిచేయడం లేదని, ధోమల నివారణపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఒకసారి ధోమల మందు పిచికారి చేయగా కొన్ని గల్లీలకే పరిమితం అయ్యిందన్నారు.

వీధి లైట్లు లేక చీకట్లో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గజ్వేల్ మండలంలోనే ఆదర్శ గ్రామంగా ఉండే గ్రామాన్ని నేడు చెత్త కుప్పగా తయారు చేశారన్నారు. గ్రామంలో ఇంటింటి చెత్త సేకరణ నిలిచిపోయిందని, రోడ్లను ఊడ్చడం, పిచ్చి మొక్కల తొలగింపు, డ్రైనేజిల పూడికతీత పట్టించుకోవడం లేదన్నారు. గృహాలక్ష్మి కింద మంజూరైన ఇండ్ల పనులు నిలిచిపోయాయని, కొందరికి మాత్రమే బిల్లులు చెల్లిస్తున్నారని ఆరోపించారు. ఉపాధి హామీ వేతనం పనిదినాల కంటే తక్కువ రావడం, పనిచేయని వారికి కూడ హాజరు వేస్తున్నారని ఆరోపించారు.

గత ప్రభుత్వం హరితహారం ద్వారా ఏర్పాటుచేసిన హరితవనాలు కాల్చి వేస్తున్నారని, పాఠశాలలో పెంచిన చెట్లను నరికి అమ్ముకున్నారని ఆరోపించారు. గ్రామంపై సర్పంచ్ భర్త,  కుటుంబీకుల పెత్తనాలు, సమస్యలు చెప్పుకోవడానికి వెలితే బెదిరింపులు, రహస్య తీర్మానాలు చేస్తున్నారని ఆరోపించారు. తాగునీరు, రహదారులు, అక్రమ మట్టి తవ్వకాలు ఇలా ఎన్నో సమస్యలతో గ్రామంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఎంపీఓ దయాకర్ ను కోరారు.