25 June, 2026 | 12:21 PM

ధనార్జనే ద్యేయంగా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పనులు

25-06-2026 11:32 AM

ఖానాపూర్ (విజయక్రాంతి): ధనార్జనే ద్యేయంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ వ్యవహరిస్తున్నారని ఖానాపూర్ మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్ లు ఆరోపించారు. బుధవారం ఖానాపూర్ మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశం కార్యాలయంలో జరిగింది. సమావేశం అనంతరం కాంగ్రెస్ కౌన్సిలర్లు విలేకరులతో మాట్లాడారు. 11వ వార్డు కౌన్సిలర్, డిసిసి ఉపాధ్యక్షులు రాజుర సత్యం మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ రెండవ వార్డ్ కౌన్సిలర్ రాజా గంగన్న తో కలిసి మున్సిపల్ వాహనాల పెట్రోల్ కొరకు తన సొంత పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించాలని డిమాండ్ చేస్తూ రూ. లక్ష పైచిలుకు డబ్బులు ముందస్తుగా తన ఖాతాలో వేయించుకొని వాడుకున్నారని ,అనంతరం వాహనాల పెట్రోల్ కోసం కమిషనర్, ఇతర సిబ్బంది ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయడం లేదని ఆరోపించారు.

అంతేకాకుండా గతంలో తాము మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు సొంత వాహనం కోసం ఎటువంటి డబ్బులు తీసుకోలేదని, ప్రస్తుత చైర్మన్ నెలకు 33 వేల రూపాయలు కావాలని ఎజెండా తీర్మానంలో పెట్టడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. మనది చిన్న మున్సిపాలిటీ కావడం వల్ల ముందుగా అభివృద్ధి పై దృష్టి పెట్టాలని తాము సమావేశంలో కోరినప్పటికీ అదేం కాకుండా తమ కొరకు నిధులు కావాలని పట్టుబట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కాగా ఇటీవల పట్టణ యువకులు ప్రధాన రహదారి వెడల్పు కోసం నిధులు కేటాయించాలని నిరసన వ్యక్తం చేసినా ఎజెండాలో 20 లక్షల రూపాయల నిధులు కేటాయించాలని తాము డిమాండ్ చేసిన చైర్మన్ సహకరించలేదని ఆరోపించారు. కాగా చైర్మన్ వైస్ చైర్మన్ లు పట్టణ అభివృద్ధి కోసం పనిచేయడం లేదని వారు ఆరోపించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు నిమ్మల రమేష్, గొర్రె తిరుమల గంగాధర్, సాజియా బేగం జమాల్, మీసా పోసాని, లు ఉన్నారు.