25 June, 2026 | 12:42 PM

దేవుడి మాన్యానికి ఎసరు

25-06-2026 11:42 AM
  1. రోడ్డు విస్తరణ అంతా దేవుడి భూమి నుండే...
  2. అధికారులతో కుమ్మక్కే న ప్రైవేట్ భూమి వారు
  3.  ఖండించిన బీజెపి, ధార్మిక సెల్

ఖమ్మం టౌన్, (విజయక్రాంతి): గుడిని మింగు దామని చూసే వాడు ఒకడు, గుడిలోని లింగాన్నే మింగుదాము అనుకునే వాడు ఇంకొకడు, దేవుడి భూమిని మింగుదామని చూసేవాడు ఒకడు, వాడి వద్ద అమ్యామ్యాలు తీసుకుని వారికి సహకరించేందు కు కొందరు అధికారులు. చేతనైతే సహాయం చేయాలి కానీ... దాతలు ఇచ్చిన భూమికి కూడా ఎసరు పెట్టాలని చూడటం దారుణమని గ్రామస్తులు అంటున్నారు. నాడు దేవుడికి భూమి విరాళంగా ఇచ్చిన దాతలు వచ్చి ఆ భూమిని కాపాడుకోవాల్సిన పరిస్థితి దాపరించింది.  వివరాల్లోకి వెళ్తే... ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ముత్తారం గ్రామంలో శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ఆలయం ఉంది. ఈ ఆలయానికి గతంలో  దాతలు 150 ఎకరాల భూమి ఇచ్చారు. ఇప్పుడు ముత్తారం నుండి జీడీ గుంట రామస్వామి సన్నిధి వరకు 2 కిలోమీటర్ల కు రూ. 2 కోట్ల 40 లక్షలతో గ్రావెల్ రోడ్ మంజూరి అయ్యింది. దీంతో గ్రామస్తులందరూ సంతోషించారు. అధికారులు పనులు మొదలుపెట్టారు. గ్రామం నుండి కిలోమీటర్ వరకు రోడ్డుకి ఇరువైపుల రైతుల పొలం తీసుకుని రోడ్డు వెడల్పు పనులు చేశారు. కానీ దేవుడు మాన్యం ఉన్న ప్రదేశం నుంచి మొత్తం రోడ్డు వెడల్పు పని ఒక్క దేవుడి భూమి లో నుండే చేపట్టారు. కొంత పనులను కూడా పూర్తి చేశారు. దీంతో గ్రామస్తులు, దేవుడి మన్యం అందజేసిన రామచంద్ర మూర్తి కుటుంబీకులు పనులను అడ్డుకున్నారు. దీంతో అధికారులు మిగతా పనులను ఆపారు. 

 న్యాయబద్ధంగా చేయాలి : బీజెపి రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు. రోడ్డు విస్తరణ పనులను ఇరువైపులా భూములను కలుపుకొని చేయాలి కానీ ఒక్క దేవుడి మన్యంలో తీయడం సబబు కాదని అధికారులు ఈ కార్యక్రమాన్ని మానుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని దేవకి వాసుదేవరావు అన్నారు. దేవకి వాసుదేవరావు, బిజెపి ధార్మిక సెల్ జిల్లా కన్వీనర్ మారుతి ప్రసాద్, కో కన్వీనర్ శ్రీలక్ష్మి, రామారావు, శ్రీకాంత్, రాము, గ్రామస్థులు బుధవారం ముత్తారం గ్రామంలోని దేవాలయాన్ని, దేవుడి భూములను, విస్తరణ చేపట్టిన రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, అక్కడ జరుగుతున్న అక్రమణం గురించి నాయకులకు వివరించారు. దేవుడు మాన్యం ఆక్రమించాలని చూస్తే మేము చూస్తూ ఊరుకోమని, తప్పుడు పనులను ఆపకపోతే ఆ దేవుడు క్షమించడని హెచ్చరించారు. అధికారులు ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై మొత్తం భూమి దేవుడి మన్యం నుండే తీయాలని చూస్తున్నారని,  దేవుడు మాన్యం భూములపై సమగ్ర విచారణ నిర్వహించాలని  అధికారులను డిమాండ్ చేశారు. సంబంధిత పంచాయతీరాజ్ ఏఈ రాంబాబుని విజయ క్రాంతి ఫోన్లో వివరణ కోరగా పొంతన లేని సమాధానం చెప్పారు. అక్కడ పనులు ఏమి చేయలేదని అన్నారు. అక్కడ పనులు జరిగాయిగా అని అడగగా తాను వెళ్లి పరిశీలిస్తానని తెలిపారు.

వివరణ కోరాము: పంచాయతీ రాజ్ డి ఇ శ్రీనివాసరావు

ఈ విషయంపై గ్రామస్తుల నుండి ఫిర్యాదు అందిందని, సర్వే చేసి వివరాలు అందజేయమని జేఈ  ని కోరినట్లు తెలిపారు.