విద్యార్థులకు అందుబాటులో శాశ్వత డిగ్రీ కళాశాల భవనం
- మంత్రి శ్రీధర్‌బాబు చొరవకు విద్యార్థుల హర్షం
- మంథనిలో కలెక్టర్ కోయ శ్రీహర్ష పర్యవేక్షణ
మంథని, ఆగస్టు 12 (విజయక్రాంతి)మంథని విద్యార్థులకు ఉన్నత విద్యను మరింత చేరువ చేసేందుకు శాశ్వత ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు చొరవతో డిగ్రీ కళాశాలకు అవసరమైన నిధులు సమకూర్చి, విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శాశ్వత భవనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు.
బుధవారం మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాలను కలెక్టర్ కోయ శ్రీహర్ష పర్యవేక్షించారు. మల్లెపల్లి శివారులో కొనసాగుతున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు రాకపోకల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, వారికి సౌకర్యవంతంగా ఉండే ప్రదేశంలో కళాశాలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో జూనియర్ కళాశాల మైదానాన్ని పరిశీలించినట్లు తెలిపారు.డిగ్రీ కళాశాల శాశ్వత భవన నిర్మాణానికి అవసరమైన ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, ప్రస్తుతం ఉన్న కళాశాలను వారం రోజుల్లోగా మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించినట్లు తెలిసింది.
విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మంత్రి శ్రీధర్బాబు ప్రత్యేక చొరవ చూపడం, డిగ్రీ కళాశాలకు నిధులు సమకూర్చి శాశ్వత భవన నిర్మాణానికి కృషి చేయడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్న కలెక్టర్ కోయ శ్రీహర్షకు స్థానికులు అభినందనలు తెలిపారు.ఈ పర్యవేక్షణ కార్యక్రమంలో మంథని తహసీల్దార్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, ఉన్నతాధికా రులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.






