భారీ వర్షాలు, అప్రమత్తమే ప్రాణరక్షణ!
కంగ్టి మండలం వ్యాప్తంగా ప్రజలకు సీఐ వెంకటరెడ్డి హెచ్చరిక
అవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలి
కంగ్టి: కంగ్టి మండలం వ్యాప్తంగా గత మూడురోజుల నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కంగ్టి సీఐ వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు, కాలువలు, చెరువుల వద్దకు వెళ్లరాదని, నీటి ప్రవాహాలను దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. అవసరం ఉంటేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాహనదారులు అత్యంత జాగ్రత్తగా ప్రయాణించాలని తెలిపారు. చిన్నారులను నీటి ప్రవాహాల వద్దకు వెళ్లనీయకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే పోలీసు స్టేషన్ కు సమాచారం అందించాలని సీఐ వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు.






