వరదలో చిక్కుకున్న బొలెరో
చాకచక్యంగా ప్రాణాపాయం నుండి తప్పించుకున్న డ్రైవర్
గంటపాటు శ్రమించి జేసీబీతో వాహనాన్ని బయటికి తీసిన గ్రామస్తులు
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.పెంచికల్పేట్ మండలంలోని కొండపల్లి–గొల్లగూడెం గ్రామాలను కలిపే ప్రధాన రహదారిపై ఉన్న తాత్కాలిక వంతెనపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండగా ఓ బులేరో వాహనం వరదలో చిక్కుకుంది. వంతెన దాటుతున్న సమయంలో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో వాహనం ముందుకు కదలక నిలిచిపోయింది.ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ చాకచక్యంగా వాహనం నుంచి బయటకు దూకి ప్రాణాలను కాపాడుకున్నాడు.సమాచారం అందుకున్న గ్రామస్తులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దాదాపు గంటపాటు శ్రమించి జేసీబీ సహాయంతో బులేరో వాహనాన్ని సురక్షితంగా బయటికి తీశారు.భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రవాహం ఉన్న వాగులు, తాత్కాలిక వంతెనలు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.






