ప్రజలు మోసపూరిత రాజకీయాలను తిరస్కరించాలి
జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి
కల్వకుర్తి, జూన్ 1: అధికారం కోసం అనేక హామీలిచ్చి మోసపూరిత రాజకీయాలు చేసిన పార్టీలను ప్రజలు తిరస్కరించాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి అన్నారు . సోమవారం కల్వకుర్తి పట్టణంలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో నిర్వహించిన బీఎల్‌ఏ-2 ఏజెంట్లు, బూత్ అధ్యక్షుల సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్ ప్రజల ఆశలను వమ్ము చేసిందని, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా ఎన్నికల హామీలను విస్మరించిందన్నారు. రెండు పార్టీల వైఫల్యాలను ప్రజలకు వివరించి బూత్ స్థాయిలో బీజేపీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడమే కేంద్ర ఎన్నికల సంఘం లక్ష్యమని అర్హుడైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో పేరు నమోదు అయ్యేలా బీఎల్‌ఏ-2 ఏజెంట్లు, బూత్ అధ్యక్షులు కృషి చేయాలన్నారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేర్చాలని కోరారు. వారితో పాటు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దుర్గాప్రసాద్, ఎస్‌ఐఆర్ తాలూకా కోఆర్డినేటర్ రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు బోడ నరసింహ, జిల్లా కార్యదర్శి గుర్రాల రాంభూపాల్ రెడ్డి, గోరటి నరసింహ, కృష్ణ గౌడ్, సురేందర్ గౌడ్, కృష్ణారెడ్డి, ఎల్లయ్య, రామకృష్ణ, దండు శ్రీను, నరెడ్ల శేఖర్ రెడ్డి, రహమతుల్లా, బాబీ దేవ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






