16 April, 2026 | 4:01 AM

మరింత ఆలస్యంగా పెద్ది

16-04-2026 02:26 AM

టాలీవుడ్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న పాన్-ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే మ్యాసీవ్ బజ్ క్రియేట్ చేసింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. అయితే, ఈ సినిమా ఇప్పటివరకు మూడుసార్లు వాయిదా పడింది.

వాస్తవానికి ఈ సినిమాను మేకర్స్ గత మార్చి 27న రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలనుకున్నారు. షూటింగ్ ఆలస్యం కావడం, పవన్‌కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కోసం ఏప్రిల్ 30న విడుదల చేయనున్నట్టు రెండోసారి కూడా వాయిదా వేశారు. ఇప్పుడు మూడోసారి వాయిదా ప్రకటన కూడా చిత్రబృందం అధికారికంగా ధ్రువీకరించింది. అయితే, టీమ్ ఈసారి కచ్చితమైన రిలీజ్ డేట్‌ను ప్రకటించలేదు.

మేకర్స్ తాజాగా చేసిన ప్రకటన ప్రకారం.. ఈ సినిమా జూన్‌లో థియేటర్లలోకి అడుగుపెట్టనుంది. సినిమా పోస్ట్-ప్రొడక్షన్‌కు మరింత సమయం అవసరమైన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.

జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్; డీవోపీ: ఆర్ రత్నవేలు; ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా; ఎడిటర్: నవీన్ నూలి.