జిల్లాలో క్రైమ్ ఫ్రీ డివిజన్ల ఏర్పాటుకు ప్రజల భాగస్వామ్యం కీలకం
గోదావరిఖని పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీలో పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి
గోదావరిఖని,(విజయక్రాంతి): రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్ డీసీపీ బి. రాంరెడ్డి సోమవారం గోదావరిఖని 1-టౌన్ పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్ రికార్డులను, సిబ్బంది పనితీరును, పరిసరాల నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సిబ్బంది నిర్వహించిన పరేడ్‌ను వీక్షించి, ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి రివార్డులను అందజేశారు.
ప్రజాక్షేత్రంలోనే పోలీసుల పనితీరు
అనంతరం స్టేషన్ పరిధిలోని 35 డివిజన్ల పోలీస్ ఆఫీసర్లతో డీసీపీ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి డివిజన్‌ను ‘క్రైమ్ ఫ్రీ’గా మార్చడమే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. డివిజన్ పోలీస్ ఆఫీసర్లు వారం మొత్తం ఆఫీసుకే పరిమితం కాకుండా, వారానికి కనీసం రెండు మూడుసార్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకోవాలని సూచించారు.
డీసీపీ జారీ చేసిన కీలక ఆదేశాలు.. నేరాల నివారణ
ఆస్తి సంబంధిత నేరాలు, మహిళలపై వేధింపులు మరియు సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలి. నంబర్ ప్లేట్లు లేని వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. యువతకు దిశానిర్దేశం గంజాయి, మాదకద్రవ్యాలు, ఆన్‌లైన్ బెట్టింగ్ లోన్ యాప్ మోసాల పట్ల యువతను అప్రమత్తం చేయాలి. వారిని సామాజిక సేవా కార్యక్రమాల వైపు మళ్లించేలా ప్రోత్సహించాలి.
నిఘా నేత్రాలు
పట్టణంలో ఆసుపత్రులు, దేవాలయాలు, అపార్ట్‌మెంట్లు మరియు వాణిజ్య సముదాయాల్లో సిసి కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలి. భద్రతా సిబ్బంది వివరాలను ఎప్పటికప్పుడు సేకరించాలి.
ట్రాఫిక్ భద్రత
రాజీవ్ రహదారిపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ నిబంధనలపై అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ స్ట్రీట్ కార్నర్ సమావేశాలు, నైట్ హార్ట్ కార్యక్రమాల ద్వారా ప్రజలతో సమన్వయం పెంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 1-టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, అఫ్జలుద్దీన్, ఎస్‌ఐలు రమేష్, మనోహర్, అనూష తదితరులు పాల్గొన్నారు.






