రివేంజ్ పాలిటిక్స్ నేను చేయను..!
అది బీఆర్ఎస్ నేతలకే సాధ్యం
హరీష్‌రావు తనపై పీడీ యాక్ట్ పెట్టాలని కుట్ర పన్నారు
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సంగారెడ్డి బ్యూరో,(విజయక్రాంతి): పగలు, ప్రతికారం తీర్చుకునే నాయకుడిని తాను కానని, తనకు అలాంటి రాజకీయాలు అవసరం లేదని, ఇలాంటి రాజకీయాలు బీఆర్ఎస్ నేతలకే చెల్లుతాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం సంగారెడ్డిలో బీఎల్ఏల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2014 లో నేను ఓడిపోయిన తర్వాత రాజకీయంగా హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు నాపై కుట్రలు చేశారన్నారు. సంగారెడ్డి మంజూరైన మెడికల్ కాలేజీని హరీష్ రావు సిద్దిపేటకు తరలించాలని కుట్రలు పన్నారని విమర్శించారు.
2013లో ఉమ్మడి రాష్ట్రంలో సంగారెడ్డికి మెడికల్ కాలేజీ కోసం అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ప్రతిపాదనలు పంపారని, ఆ తర్వాత ఈ కాలేజీని సిద్దిపేటకి హరీష్ రావు తీసుకెళ్తే స్థానికి ఎమ్మెల్యే అడ్డుకోలేదన్నారు. అప్పుడు మూడేళ్లపాటు సంగారెడ్డికి మెడికల్ కాలేజీ కోసం పోరాటం చేశానని, ఉద్యమాన్ని అడ్డుకోవాలని పోలీసులతో నాపై కేసులు పెట్టించే కుట్రలు జరిగాయని తెలిపారు. 2015లో సంగారెడ్డిలో రాహుల్ గాంధీ సభ పెట్టాలని అప్పటి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగారని, 3 లక్షల మందితో సంగారెడ్డిలో రాహుల్ గాంధీ సభ పెట్టాలని ప్లాన్ చేశామన్నారు. ఆరున్నర కోట్ల రూపాయల అప్పు తెచ్చి రాహుల్ సభ పెట్టి సక్సెస్ చేస్తే బీఆర్ఎస్ నాయకులకు మింగుడు పడలేదన్నారు.
హరీష్ రావుని నేను టార్గెట్ చేయట్లేదని, నిందించడం లేదని ఆయన వ్యూహంలో ఆయనే కరెక్ట్ అని అన్నారు. అప్పటి సిటీ కమిషనర్ మహేందర్ రెడ్డి, ముగ్గురు విజిలెన్స్ ఐపీఎస్ అధికారులు, నలుగురు డీఎస్పీలతో జగ్గారెడ్డి ఏమైనా ఇల్లిగల్ పనులు చేశాడా అని విచారణ ప్రారంభించారని గుర్తు చేశారు. పోలీసులు పూర్తి విచారణ చేసి జగ్గారెడ్డి దగ్గర ఆస్తులు, ఇండ్లు లేవని నివేదిక ఇచ్చినట్లు చెప్పారు. రాహుల్ గాంధీ సభ సంగారెడ్డిలో నేను పెట్టాననే కోపంతో హరీష్ రావు తనపై పగ పెంచుకున్నాడని, పటాన్ చెరులో ఏమైనా భూ దందా చేశానేమోనని ఎంక్వైరీ చేసినట్లు జగ్గారెడ్డి తెలిపారు.
నాకు అప్పులు ఇచ్చిన ఓ 10 మందిని సెలెక్ట్ చేసుకుని వారి ఇంటికి వెళ్లి జగ్గారెడ్డి డబ్బులు ఇవ్వడం లేదని కంప్లైంట్ ఇవ్వాలని వారిపై బీఆర్ఎస్ నేతలు ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. 40 పిటిషన్లు జగ్గారెడ్డిపై వస్తే పీడీ యాక్ట్ పెడుదామని హరీష్ రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే, పోలీసులు కుట్ర పన్నారని చెప్పారు. తనపై ఎలాగైనా పిడి యాక్ట్ పెట్టాలని అప్పటి హోంమంత్రి మహమూద్ అలీ వద్ద పెద్ద సమావేశం పెట్టుకున్నారని, అయితే పోలీసులు సాధ్యం కాదని తేల్చడంతో చివరికి పాస్ పోర్ట్ కేసులో నన్ను ఇరికించి అరెస్ట్ చేసి జైలుకు పంపారన్నారు. ఈ విషయం సంగారెడ్డి ప్రజలకు తెలియాలని చెబుతున్నానని, నా ఆట పాట మాత్రమే చూశారు..నేను ఎన్ని కష్టాలు పడ్డానో నాకు మాత్రమే తెలుసని ఆవేదన వ్యక్తం చేశారు. తాను మాత్రం రివేంజ్ రాజకీయాలు చేసే వ్యక్తిని మాత్రం కాదన్నారు.






