హైమాస్ట్ లైట్లను ప్రారంభించిన నగర మేయర్
ముకరంపుర,(విజయ క్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 21వ డివిజన్ పరిధిలోని కొత్త యాస్వాడ ప్రాంతంలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ గారు మాట్లాడుతూ, నగరంలోని ప్రతి డివిజన్‌లో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించేందుకు నగరపాలక సంస్థ నిరంతరం కృషి చేస్తోందన్నారు.
హైమాస్ట్ లైట్ల ఏర్పాటు వల్ల రాత్రి వేళల్లో ప్రజలకు మెరుగైన వెలుతురు అందడంతో పాటు భద్రత కూడా పెరుగుతుందని తెలిపారు. కాలనీల అభివృద్ధికి అవసరమైన రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు తదితర సౌకర్యాలను దశలవారీగా కల్పిస్తున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వరాల నర్సింగం, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






