మిల్లులో అన్ లోడ్ చేస్తుండగా దాడి
- దొడ్డు బియ్యం లారీని పట్టుకున్న అధికారులు
మంచిర్యాల క్రైమ్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో గల మంజునాథ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్ లో జిల్లా అధికారులకు ఎలాంటి అనుమతి లేకుండా ఇతర జిల్లా నుంచి తీసుకొచ్చిన దొడ్డు బియ్యం అన్ లోడింగ్ చేసే క్రమంలో జిల్లా సివిల్ సప్లై అధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారులు సోమవారం సాయంత్రం దాడి చేసి పట్టుకున్నారు. పట్టుబడిన లారీలో 30 టన్నుల దొడ్డు బియ్యం ఉన్నట్లు జిల్లా అధికారులు గుర్తించారు. ఇవి రేషన్ బియ్యమా? లేక ఇతర బియ్యమా? అనేది తీర్చడం కోసం సివిల్ సప్లై అధికారులు బియ్యం శాంపిల్ ని పరీక్షల నిమిత్తం తీసుకువెళ్లారు.
ముందు నుంచే మంజునాథ మిల్లు అవకతవకలకు కేరాఫ్ గా ఉంది. గత సీజన్ల దాన్యం అమ్ముకొని, అసోసియేషన్ అండదండలతో డిఫాల్ట్ లోకి వెళ్లకుండా అధికారులకు ఆమ్యామ్యాలు ఇస్తూ వస్తున్నారని కొందరు మిల్లర్లు బాహటంగా పేర్కొంటున్నారు. ఇలా అక్రమంగా ధాన్యం అమ్ముకొని, ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి తక్కువ ధరకు బియ్యం కొనుగోలు చేస్తుండడం పరిపాటిగా మారింది. అధికారులు ఖచ్చితమైన నిఘా ఉంచి, సీజన్ల వారీగా ధాన్యం నిల్వలను లెక్కిస్తే దొంగలు బయటపడే అవకాశం ఉంది. ఈ దాడిలో సివిల్ సప్లైస్ డిటీ స్రవంతి, టిఏ శంషుద్దీన్, టాస్క్ ఫోర్స్ ఎస్సై డి కొండ రమేష్, జైపూర్ ఆర్ఐ తిరుపతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






