బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!
రేవంత్ సర్కారుపై నెల్లూరి కోటేశ్వరరావు ధ్వజం
ఖమ్మం, ఆగస్టు 24(విజయక్రాంతి): విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతోందని ఆ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ప్రకటించారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత విద్యకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం బకాయిలను పేరుకుపోయేలా చేయడం దురదృష్టకరమని విమర్శించారు.
ఇదే సమయంలో ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశంగా మారిన 22ఏ నిషేధిత భూముల వ్యవహారంపైనా ప్రభుత్వాన్ని నిలదీశారు. సామాన్యుల భూములు నిషేధిత జాబితాలో చిక్కుకుంటుంటే పెద్ద సంస్థలకు భూముల కేటాయింపులు ఏ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయో ప్రభుత్వం ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సుమారు రూ.15 వేల కోట్లకు చేరాయని ఆయన పేర్కొన్నారు. ఫీజులు చెల్లించలేక విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని, మరోవైపు కళాశాలల యాజమాన్యాలు బకాయిల కోసం ఒత్తిడి చేయడంతో విద్యార్థుల చదువులు, భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే బకాయిలను విడుదల చేసి విద్యార్థులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.
ఫీజు బకాయిల విడుదల కోసం బీజేపీ మాజీ ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్రావు చేపట్టిన నిరాహార దీక్షకు ఖమ్మం జిల్లా బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే ఖమ్మం నుంచి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులతో కలిసి హైదరాబాద్కు తరలివెళ్లి ఆందోళనలో పాల్గొంటామని స్పష్టం చేశారు. అవసరమైతే ఈ సమస్యను జిల్లాలోనూ ప్రజా ఉద్యమంగా మలుస్తామని హెచ్చరించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తా వెంకటేశ్వర్లు, నాయకులు మందడపు సుబ్బారావు, కృష్ణయ్య, రుద్రగాని మాధవ్రావు తదితరులు పాల్గొన్నారు.






