25 August, 2026 | 3:23 AM

వీసంశెట్టి వెంకటేశ్వర్లు త్యాగం, సేవలు చిరస్మరణీయం

25-08-2026 12:34 AM
  1. ఎర్రజెండా విస్తరణకు ఎనలేని కృషి చేశారు
  2. అమరుల ఆశయ సాధనకు పునరంకితమవుదాం
  3. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

పాల్వంచ, ఆగస్టు 24 , (విజయక్రాంతి): అమరజీవి వీసంశెట్టి వెంకటేశ్వర్లు చేసిన నిస్వార్థ త్యాగం, ప్రజలకు, పార్టీకి ఆయన అందించిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం నాగారం గ్రామంలో అమరజీవి వీసంశెట్టి వెంకటేశ్వర్లు స్మారక స్తూపం వద్ద సోమవారం ఆయన 50వ వర్ధంతి సభ ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు ఆయన చిత్రపటానికి, స్మారక స్తూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సంతాప సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి, ఎర్రజెండా విస్తరణకు వీసంశెట్టి వెంకటేశ్వర్లు తన జీవితాన్ని ధారపోశారని కొనియాడారు.

పాల్వంచ, బూర్గంపాడు, ములకలపల్లి మండలాల్లో భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా భూమి, భుక్తి, వ్యవసాయ కూలీల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేశారని గుర్తుచేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల నాయకత్వంలో పనిచేసి అణగారిన వర్గాలకు కొండంత అండగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన కుటుంబం నేటికీ పార్టీలో నిబద్ధతతో కొనసాగడం గర్వకారణమన్నారు. 

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, కల్లూరి వెంకటేశ్వరరావు, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, రాష్ట్ర సమితి సభ్యులు నరాటి ప్రసాద్, సలిగంటి శ్రీనివాస్, చండ్ర నరేంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు అడుసుమిల్లి సాయిబాబా వీసంశెట్టి పూర్ణచంద్రరావు, ఉప్పుశెట్టి రాహుల్ తదితరులు పాల్గొన్నారు.