27 July, 2026 | 2:20 AM

నత్త నడకన ఆర్యూబీ!

27-07-2026 01:52 AM
  1. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు.. 
  2. ప్రమాదాలకు నిలయంగా మారిన తాత్కాలిక మార్గం
  3. అత్యవసర సేవలకు వెళ్లే అంబులెన్స్లు, గర్భిణులు, వృద్ధులు, 
  4. అనారోగ్యంతో ఉన్న రోగులు కూడా ఈ మార్గంలో తీవ్ర ఇబ్బందులు 
  5. పాఠశాలకు వెళ్లే స్కూల్ బస్సులు రెండు గంటలు ఆలస్యం 
  6. హెచ్చరిక బోర్డులు, రాత్రివేళల్లో తగిన లైటింగ్,
  7. ట్రాఫిక్ నియంత్రణ చర్యలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి 

బోధన్, జూలై 26 (విజయక్రాంతి): బోధన్ పట్టణాన్ని మోస్రా మండలంతో అనుసంధానించే అత్యంత కీలకమైన అండర్గ్రౌండ్ రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంతో స్థానిక ప్రయాణికులు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

గత కొంతకాలంగా పనులు ప్రారంభమైనప్పటికీ ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ మార్గం ద్వారా ప్రతిరోజూ బెల్లాల్ ,ఏరాజు పల్లి, ఆమ్దుపూర్, ఊట్పల్లి, రాజవ్ నగర్ తండా, మోస్ర, తిమ్మాపూర్, చింతకుంట తదిత గ్రామాలకు ఈ గుండా వెళ్తారు. మోస్రా, పరిసర గ్రామాల ప్రజలు బోధన్కు రాకపోకలు సాగిస్తుంటారు. వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్కు తరలించే రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ఈ రహదారిపైనే అధికంగా ఆధారపడుతున్నారు. 

అయితే బ్రిడ్జి నిర్మాణ పనులు ఆలస్యమవుతుండటంతో ప్రయాణం దుర్భరంగా మారింది. ప్రస్తుతం నిర్మాణ ప్రాంతంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన దారి పూర్తిగా బురదమయంగా మారింది. స్వల్ప వర్షం కురిసినా రహదారి చిత్తడిగా మారి వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడు తోంది.  ద్విచక్ర వాహనాలు తరచూ జారి పడుతుండగా, ఆటోలు, కార్లు, ట్రాక్టర్లు, సరుకు రవాణా వాహనాలు బురదలో చిక్కుకుని గంటల తరబడి నిలిచిపోతున్నాయి. 

పలువురు ద్విచక్ర వాహనదారులు ఇప్పటికే ప్రమాదాలకు గురైన ఘటనలు చోటుచేసుకున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అత్యవసర సేవలకు వెళ్లే అంబులెన్స్లు, గర్భిణులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న రోగులు కూడా ఈ మార్గంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే స్కూల్ బస్సులు రెండు గంటలు ఆలస్యంగా నడుపుతున్నారు. విద్యార్థులు ప్రతిరోజూ అవస్థలు పడుతుండగా, ఉద్యోగులు సమయానికి కార్యాలయాలకు చేరుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

స్థానికుల అభిప్రాయం ప్రకారం, నిర్మాణ సంస్థ పనులను వేగవంతం చేయకుండా నెమ్మదిగా కొనసాగించడం వల్ల సమస్యలు మరింత పెరుగుతున్నాయి. పనులు పూర్తయ్యే వరకు కనీసం తాత్కాలిక రహదారిని చదును చేసి, కంకర వేసి, వర్షపు నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అలాగే ప్రమాదాలను నివారించేందుకు హెచ్చరిక బోర్డులు, రాత్రివేళల్లో తగిన లైటింగ్, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ అండర్గ్రౌండ్ రైల్వే బ్రిడ్జి పూర్తయితే బోధన్‌మోస్రా మధ్య రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు రైల్వే గేటు వద్ద వేచి ఉండే సమస్య కూడా తొలగిపోతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే పనుల జాప్యం కారణంగా ప్రజలు ప్రతిరోజూ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కొనసాగుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నిర్మాణ పనులను వేగవంతం చేసి, నాణ్యతతో త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు, వాహనదారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం

బోధన్ -మేస్రా రోడ్డు పనులు వల్ల ఈ స్కూల్ బస్సు విద్యార్థులకు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం,  రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి పనులు వేగవంతం కల్పించాలని కోరుతున్నాము. 

ఎం.నరేందర్ గౌడ్ ఊట్పల్లి 

ఉపసర్పంచ్

వేగం అంతం చేయాలి

బోధన్- మోస్రా రోడ్డు అండర్ గ్రౌండ్ రైల్వే బ్రిడ్జి పనులు వేగం అంతం చేయాలి. వ్యవసాయదారులకు, ప్రయాణికులకు, రాకపోకలకు చాలా అంతరాయం కలుగుతుంది, రోజుకు అయిదు సార్ల బోధన్ కు వచ్చి వెళ్లాల్సిన పనులు ఉంటాయి, కావున తొందరగా పూర్తి చేయాలి. 

బి.పల్లెన్న ఆమ్దుపూర్ గ్రామస్తులు