పేదల ఆరోగ్యానికి ‘ఆయుష్మాన్’
- దేశ్యాప్తంగా 12 కోట్లకు పైగా కుటుంబాలకు లబ్ధి
- జన ఔషధితో తక్కువ ధరకు మందులు
- ఆరోగ్య మౌలిక వసతుల విస్తరణ
- ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్
- జాతీయతాభావంతోనే దేశాభివృద్ధి
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): ఆయుష్మాన్ భారత్ పేదల ఆరోగ్య భద్రతకు అతిపెద్ద కవచంగా మారిందని బీజేపీ ఎంపీ డా. కె. లక్ష్మణ్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ పాలనలో వైద్యరంగంలో అనేక సంస్కరణలు, మార్పులు తీసుకొచ్చారని ఆయన తెలిపారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం, గ్రామీణ-పట్టణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత చేరువ చేయడం, తక్కువ ధరలకు మందులు అందించడం, డిజిటల్ ఆరోగ్య మౌలిక వసతుల అభివద్ధి, వైద్య విద్య విస్తరణ వంటి అంశాల్లో గణనీయమైన పురోగతి సాధించామని పేర్కొన్నారు. నారాయణగూడలోని కేశవ మెమోరియల్ కళాశాలలో బీజేపీ డాక్టర్స్ సెల్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా దేశంలోని సుమారు 12.37 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని, ఈ పథకం కింద అర్హులైన కుటుంబాలకు ఏటా రూ.5 లక్షల వరకు ద్వితీయ, తతీయ స్థాయి ఆస్పత్రుల్లో చికిత్స పొందే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. మార్కెట్‌లోని ప్రముఖ బ్రాండెడ్ మందులతో పోలిస్తే జనరిక్ మందులు సుమారు 50 శాతం నుంచి 80 శాతం వరకు తక్కువ ధరలకు లభిస్తున్నాయని పేర్కొన్నారు.
2025 జూన్ 30 నాటికి దేశవ్యాప్తంగా 16,912 జన ఔషధి కేంద్రాలు ప్రారంభించబడ్డాయని, వీటి ద్వారా గత 11 ఏళ్లలో ప్రజలకు దాదాపు రూ.38 వేల కోట్ల మేర ఆదా జరిగిందని తెలిపారు. దేశంలో వైద్య విద్యకు కూడా పెద్దపీట వేశామని, మెడికల్ కాలేజీల సంఖ్య 844కు పెరిగిందని, ఎంబీబీఎస్ సీట్లు 1,39,489కు చేరుకున్నాయని తెలిపారు. ఈ విస్తరణతో జిల్లాల స్థాయిలోనే మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని లక్ష్మణ్ పేర్కొన్నారు.
మాతా-శిశు ఆరోగ్యంలో పురోగతి
మాతా-శిశు ఆరోగ్య రంగంలోనూ గణనీయమైన మార్పులు నమోదయ్యాయని ఎంపీ డా.లక్ష్మణ్ తెలిపారు. భారతదేశ మాత మరణాల నిష్పత్తి 2014 130 ఉండగా 2019 93కి తగ్గిందన్నారు. అలాగే శిశు మరణాల రేటు 2014 39 ఉండగా 2021 నాటికి 27కి పడిపోయిందని పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో చేపట్టిన సంస్కరణలు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, ఆర్థిక భరోసాను అందిస్తున్నాయని ఆయన తెలిపారు.
కార్గిల్ అమరవీరులకు నివాళి
దేశ సరిహద్దులను కాపాడుతూ ప్రాణత్యాగం చేసిన సైనికుల సేవలు ఎన్నటికీ మరువలేనివని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పేర్కొన్నారు. దేశ భద్రత, సమగ్రతను కాపాడే బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఆదివారం హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లోని వీర సైనిక స్మారక స్థూపం వద్ద ఆయన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్గిల్ విజయ్ దివస్ భారత సైన్యం అజేయ ధైర్యానికి, అసమాన పరాక్రమానికి, దేశం పట్ల ఉన్న అత్యున్నత అంకితభావానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కమిషన్ మాజీ చైర్మన్ ఎల్. నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైద్యసేవలు దేశ సేవలతో సమానం: రాంచందర్‌రావు
వైద్యులు సమాజానికి అందిస్తున్న సేవలు అమూల్యమైనవని, ఒక రోగికి చేసే వైద్యం కేవలం వ్యక్తిగత సేవ మాత్రమే కాకుండా సమాజానికి, దేశానికి చేసే సేవగా భావించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు. వైద్యరంగానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు. సోషలిజం, కమ్యూనిజం, క్యాపిటలిజం కంటే ‘నేషనలిజం’ (రాష్ట్రీయత) ద్వారానే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని రాంచందర్‌రావు అభిప్రాయపడ్డారు.
నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను కేటాయిస్తుందని తెలిపారు. జిల్లా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానల్లో అవసరమైన మందులు, వైద్య పరికరాలు, సిబ్బంది వేతనాల కోసం అధిక భాగం నిధులను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. కరోనా మహమ్మారి సమయంలో భారత్ బయోటెక్ స్వదేశీ వ్యాక్సిన్ అభివృద్ధి చేయడంలో ప్రధాని మోదీ అందించిన ప్రోత్సాహం కీలకంగా నిలిచిందని కొనియాడారు.
స్వచ్ఛ భారత్ కార్యక్రమం కేవలం పరిసరాల పరిశుభ్రతకే పరిమితం కాకుండా ‘స్వస్థ్ భారత్’ సాధనకు పునాదిగా నిలిచిందన్నారు. ఖేలో ఇండియా, అంతర్జాతీయ యోగా దినోత్సవం వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరిగిందని తెలిపారు. సోషల్ మీడియా వేదికలైన వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో వచ్చే అనధికారిక వైద్య సలహాలు, చిట్కాలను నమ్మి ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టుకోవద్దని ప్రజలకు సూచించారు. దేశ ప్రగతికి నేషనలిజం కీలకమని అన్నారు. సమాజ ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న వైద్యులందరికీ ఆయన అభినందనలు తెలిపారు.






